‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రివ్యూ.. బ్యాండ్ మేళం సౌండ్ గట్టిగానే వినిపిస్తుంది..

అంబాజీపేట మ్యారేజి బ్యాండు కులం, ధనం వ్యత్యాసంలో జరిగే రెగ్యులర్ ప్రేమ కథలకు అక్కాతమ్ముడు ఎమోషన్ జోడించి ఆత్మాభిమానంతో కొత్త రకంగా ప్లే చేసిన ఓ ఎమోషనల్ రివెంజ్ డ్రామా.

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రివ్యూ.. బ్యాండ్ మేళం సౌండ్ గట్టిగానే వినిపిస్తుంది..

Suhas Ambajipeta Marriage Band Movie Review and Rating

Ambajipeta Marriage Band : సుహాస్(Suhas) హీరోగా, శివాని(Shivani) జంటగా తెరకెక్కిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంయుక్త నిర్మాణంలో దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఫిబ్రవరి 2న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. ఈ సినిమాలో నితిన్, శరణ్య, జగదీశ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. అంబాజీపేట అనే ఓ ఊళ్ళో మల్లి(సుహాస్) వాళ్ళకి ఓ సెలూన్ షాప్ ఉంటుంది. వాళ్ళ బ్యాచ్ అంతా బ్యాండ్ మేళం వాయిస్తారు. మల్లి, పద్మ(శరణ్య ప్రదీప్) కవలపిల్లలు. పద్మ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తూ ఆదివారాలు ఆ ఊరి పెద్ద వెంకట్(నితిన్) మిల్లులో పనిచేస్తుంది. దీంతో వెంకట్ – పద్మల మధ్య అక్రమ సంబంధం ఉందని పుకార్లు వ్యాపిస్తాయి. ఊరందరికి అప్పులిస్తూ అవి కట్టకపోతే వాళ్ళ స్థలాలు లాగేసుకుంటూ ఉంటాడు వెంకట్. మల్లి చిన్నప్పట్నుంచి వెంకట్ చెల్లి లక్ష్మి(శివాని)ని ప్రేమిస్తాడు. శివాని కూడా ఒప్పుకుంటుంది. వీళ్ళ ప్రేమ సాగిపోతున్న సమయంలో ఓ సారి మల్లికి, వెంకట్ తమ్ముడికి గొడవ అవుతుంది. మరో విషయంలో పద్మకి వెంకట్ తమ్ముడికి కూడా గొడవ అవుతుంది. అదే సమయానికి మల్లి, లక్ష్మి ప్రేమ వెంకట్ కి తెలుస్తుంది.

దీంతో వెంకట్ పద్మని తను పనిచేసే స్కూల్ కి రాత్రిపూట రప్పించి బట్టలు లాగేసి అవి కాల్చి ఆ రూమ్ లో బంధించి వెళ్ళిపోతాడు. అనుకోకుండా పద్మని ప్రేమించే మల్లి ఫ్రెండ్ సంజీవి(జగదీశ్) చూడటంతో ఆమెని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాడు. విషయం తెలిసిన మల్లి ఆవేశంతో వెంకట్ ని చంపేద్దామని వెళ్తే వాళ్ళే మల్లిని కొట్టి గుండు గీస్తారు. పద్మని అలా అవమానించినందుకు మల్లి రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు? మల్లి లక్ష్మిల ప్రేమ ఏమైంది? ఆ అవమానం జరిగాక పద్మ ఏం చేసింది? వెంకట్ మల్లి, పద్మలను ఏం చేసాడు అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
డబ్బు వ్యత్యాసం, కులం వ్యత్యాసం ప్రేమలు, వాటి రివెంజ్ డ్రామాలు ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ అంబాజీపేట మ్యారేజి బ్యాండు కూడా అదే కోవకి చెందింది. కాకపోతే అలాంటి కథకి అక్క తమ్ముడు ఎమోషన్ ని చూపించి ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్ జోడించి కొత్తగా తీయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. మొదటి హాఫ్ అంతా అందరి క్యారెక్టర్స్ పరిచయాలు, హీరో – హీరోయిన్ ప్రేమ సన్నివేశాలు, విలన్ తో అక్కాతమ్ముళ్ల గొడవలు, విలన్ ఇద్దరినీ అవమానించడంతో సాగుతుంది. మొదట అంతా సాఫీగా సాగినా ఇంటర్వెల్ కి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ రివెంజ్ తీర్చుకోవడం కొత్తగా ట్రై చేయడంతో సాగి క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ గా ముగుస్తుంది. ఈ సెకండ్ హాఫ్ మాత్రం ఎవరూ ఊహించనివిధంగా డైరెక్టర్ కొత్తగా ట్రై చేసాడు.

Also Read : Amar Deep – Supritha : సురేఖ వాణి కూతురు హీరోయిన్‌గా.. బిగ్‌బాస్ అమర్‌దీప్ సినిమా..

నటీనటులు..
సుహాస్ ఇప్పటికే అదిరిపోయే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో సుహాస్ మరోసారి ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఇక శరణ్య చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఈ సినిమాలో మాత్రం తన నటనతో అదరగొట్టేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాకి శరణ్యనే హీరో. ఒంటి మీద బట్టలు లాగేసి సీన్, పోలీస్ స్టేషన్ లో విలన్ ని తన్ని మాట్లాడే సీన్.. ఈ రెండు సీన్స్ లో అయితే శరణ్య వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ గా కొత్త అమ్మాయి శివాని క్యూట్ గా కనిపించి మెప్పించింది. పుష్ప ఫేమ్ జగదీశ్ సుహాస్ ఫ్రెండ్ గా, పద్మని ప్రేమించే వ్యక్తిగా చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. విలన్ గా నితిన్ అయితే అదిరిపోయే పర్ఫార్మెన్ ఇచ్చాడు. మిగిలిన అన్ని పాత్రలు కూడా మెప్పిస్తాయి.

సాంకేతిక విషయాలు..
అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా మొత్తం అమలాపురం, ఆ చుట్టు పక్కల పల్లెటూళ్లలో రియల్ లొకేషన్స్ లో తీయడంతో చాలా అందంగా కనిపిస్తుంది. దానికి తోడు కెమెరా విజువల్స్ లో సినిమా మరింత అందంగా కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసారు. ముఖ్యంగా బ్యాండ్ మేళం వాళ్ళ సౌండ్స్ అన్ని రికార్డ్ చేసి వాటిని వాడిన తీరు బాగుంది. సాంగ్స్ కూడా వినడానికి చాలా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ కూడా ఎక్కడా సాగతీత, బోర్ అనిపించకుండా బాగా చేశారు.

దర్శకుడు మొదటి సినిమా అయినా చాలా బాగా తెరకెక్కించాడు. రెగ్యులర్ కథనే కొత్తగా రాసుకున్నాడు. కథనం సినిమా అంతా బాగా సాగినా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఇలా జరిగి ఉండకూడదు అనిపించేలా చేస్తుంది. దర్శకత్వం పరంగా మాత్రం తన బెస్ట్ ఇచ్చాడు. గీత ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన సినిమా అంటే నిర్మాణ విలువలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయో తెలిసిందే.

మొత్తానికి అంబాజీపేట మ్యారేజి బ్యాండు కులం, ధనం వ్యత్యాసంలో జరిగే రెగ్యులర్ ప్రేమ కథలకు అక్కాతమ్ముడు ఎమోషన్ జోడించి ఆత్మాభిమానంతో కొత్త రకంగా ప్లే చేసిన ఓ ఎమోషనల్ రివెంజ్ డ్రామా. ఈ సినిమా థియేటర్స్ లో కచ్చితంగా చూడాల్సిందే. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు రేటింగ్ 3 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.