Sunil Narang: తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన 24 గంటల్లోనే తన పదవికి రిజైన్ చేయడం సంచలనంగా మారింది. కొందరి వ్యాఖ్యలు తనను బాధించాయని నారంగ్ వాపోయారు. తనకు సమాచారం ఇవ్వకుండానే ప్రకటనలు కూడా జారీ చేయడంపై మండిపడ్డారు. అయితే, ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికైన 24 గంటల్లోనే పదవికి రాజీనామా చేసేంత ఇబ్బంది నారంగ్ కు ఏమి కలిగిందని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా సునీల్ నారంగ్ మూడోసారి ఎన్నికయ్యారు. అదీ నిన్ననే ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయడం టాలీవుడ్ లో కొంత సంచలనమైంది.
Also Read: నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు.. కన్నప్ప తర్వాత.. ఫ్యాన్స్ గురించి విష్ణు కామెంట్స్..
నిన్నటి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో కొంతమంది చేసిన వ్యాఖ్యలు తనను బాధించినట్లు సునీల్ నారంగ్ చెప్పారు. హీరోలు, ఇండస్ట్రీని ఉద్దేశించి కొందరు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తన దృష్టికి తీసుకొచ్చి ఏం మాట్లాడాలో తెలుసుకోకుండానే మాట్లాడటం తనకు చాలా బాధ కలిగించిందని సునీల్ నారంగ్ చెప్పారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపం చెందిన సునీల్ నారంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.
సునీల్ నారంగ్ చాలా పెద్ద సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. పెద్ద హీరోలతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఏఎంబీ మహేశ్ బాబు, సునీల్ నారంగ్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఏషియన్ థియేటర్స్(సత్యం థియేటర్స్) అల్లు అర్జున్, నారంగ్ భాగస్వామిగా ఉన్నారు. పెద్ద హీరోలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సమయంలో స్టార్ హీరోలపై ఎవరైనా కామెంట్స్ చేస్తే అది తనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ఆయన భావించినట్లు సమాచారం. ఈ కారణంతోనే సునీల్ నారంగ్ తన పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.