Kanguva : ‘కంగువ’ మూవీ రివ్యూ.. పునర్జన్మ నేపథ్యంలో..
'కంగువ' సినిమా పునర్జన్మ నేపథ్యంలో యాక్షన్ ఫిలింగా తెరకెక్కింది.

Suriya Kanguva Movie Review and Rating
Kanguva Movie Review : తమిళ్ స్టార్ హీరో సూర్య భారీ సినిమా ‘కంగువ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ కథతో పాటు ప్రస్తుత కాలానికి చెందిన కథ కలుపుతూ కంగువ సినిమాని తెరకెక్కించారు. బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, కోవై సరళ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. కంగువ సినిమా నేడు నవంబర్ 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది.
కథ విషయానికొస్తే.. ఒక కథలో.. ఫ్రాన్సిస్(సూర్య), ఏంజెలినా(దిశా పటాని)బౌంటీ హంటర్స్. ఇండియన్ బోర్డర్స్ లో ఉన్న ఓ లేబరేటరీలో జెటా అనే పిల్లాడి బ్రెయిన్ పై కొంతమంది పరిశోధనలు చేస్తూ ఉంటారు. జెటా అక్కడ్నుంచి తప్పించుకొని వచ్చి ఫ్రాన్సిస్ ఒక వ్యక్తిని చంపడం చూస్తాడు. జెటా ఫ్రాన్సిస్ కి దగ్గరవుతుండగా కొంతమంది వచ్చి జెటాని ఎత్తుకెళ్లిపోతారు.
మరో కథలో.. 1070వ సంవత్సరంలో సాగుతుంది. భారతదేశం సముద్రంలో ప్రణవాది కోన, కపాల కోన, అరణ్య కోన, హిమ కోన, సాగర కోన అనే అయిదు దీవులు ఉంటాయి. రొమానియన్లు దేశంపై దండెత్తడానికి వచ్చే ముందు ప్రణవాది కోన స్థావరం చేసుకోవాలని అందుకు అక్కడి మనుషులను చంపాలని సాగర కోన నాయకుడితో చేతులు కలిపి కొంతమందిని చంపుతారు. ఇది తెలిసి సాగర కోన నాయకుడిని ప్రణవాది కోన నాయకుడి కొడుకు కంగువ(సూర్య) చంపేస్తాడు. మోసం చేసినందుకు అతని ఫ్యామిలీని కూడా అందరూ చంపేయమన్నా అతని కొడుకు పులోమాని తన కొడుకు అని దగ్గరికి తీసుకుంటాడు కంగువ. కానీ ఆ పిల్లాడు కంగువపై పగబడతాడు. ఇక కపాల కోన నాయకుడు అథిరన్(బాబీ డియోల్) ఎప్పట్నుంచో కంగువాని చంపి ప్రణవాది కోనను స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు. మరి కంగువ – అథిరన్ మధ్య ఏం జరిగింది? కంగువను ఆ పిల్లడు ఏం చేసాడు? తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ పిల్లాడిని కంగువ కాపాడాడా? జెటాని ఎత్తుకెళ్ళి ఏం చేస్తారు? ఈ రెండు కథలకు ఉన్న సంబంధం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Matka : మట్కా’ మూవీ రివ్యూ.. రొటీన్ కథకు వరుణ్ తేజ్ నట విశ్వరూపం..
సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ లో ప్రస్తుతం జరిగే ఫ్రాన్సిస్ కథను చూపించి, జెటా పాత్రతో ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొల్పుతారు. ఆ తర్వాత వెయ్యేళ్ళ క్రితం వెనక్కు వెళ్లి కంగువ కథ చెప్తారు. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం సాగదీశారు. ఇంటర్వెల్ కి మాత్రం ట్విస్ట్ ఏమి లేకపోయినా నెక్స్ట్ ఏంటి అనే ఆసక్తి అయితే కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం సూర్య – చిన్న పిల్లాడి ఎమోషన్, కంగువ – అథిరన్ మధ్య పోరు, యాక్షన్ సన్నివేశాలతో సాగుతుంది. క్లైమాక్స్ లో ఊహించని రెండు ట్విస్ట్ లు ఇచ్చి, ఫ్యాన్స్ కు ఓ సర్ ప్రైజ్ ఇచ్చి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.
పునర్జన్మ నేపథ్యానికి కొంత సైన్స్ జోడించి చెప్పే ప్రయత్నం చేసారు. అయితే పూర్తి కథ మాత్రం ఇంకా అవ్వలేదు. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడంతో అసలు కథకు కొనసాగింపు నెక్స్ట్ పార్ట్ లో ఉండనుంది అని తెలుస్తుంది. పీరియాడిక్ సెటప్ మొత్తం బాగున్నా ఆ కథలో కొంత సాగదీత ఉంది. యాక్షన్ సన్నివేశాలు మాత్రం అదిరిపోయేలా డిజైన్ చేసుకున్నారు. సూర్య – పిల్లాడిమధ్య ఎమోషన్ ని బాగా పండించారు. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ తో పార్ట్ 2 పై మరింత ఆసక్తి నెలకొంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సూర్య మాత్రం కంగువ పాత్రలో అదరగొట్టేసాడు. మరోసారి బాగా బాడీ పెంచి ఓ కొత్త గెటప్ లో తన నటనతో ప్రేక్షకులని మెప్పించాడు. బాబీ డియోల్ నెగిటివ్ రోల్ లో తన బెస్ట్ ఇచ్చాడు. మంచి రస్టిక్ లుక్ లో కనిపించి మెప్పిస్తాడు. యోగిబాబు, రెడిన్ కింగ్ స్లీ అక్కడక్కడా నవ్విస్తారు. దిశా పటాని కేవలం అందాల ఆరబోతకే. జెటా, పులోమా పాత్రలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా బాగా నటించాడు. మిగిలిన పాత్రల్లో ఆల్మోస్ట్ అంతా తమిళ నటీనటులే నటించి మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే అదిరిపోయాయి. యాక్షన్ సీన్స్ కొత్తగా డిజైన్ చేసుకున్నారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేసారు. పీరియాడిక్ కథలో అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసారు. లొకేషన్స్ మంచి మంచి అడవులు బాగా వెతికి మరీ పట్టుకున్నట్టు తెలుస్తుంది. పీరియాడిక్ కథలో కాస్ట్యూమ్స్ డిఫరెంట్ గా కొత్తగా ప్లాన్ చేసి ఆ కథకు, కాలానికి తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ చేసారు.
VFX వర్క్స్ కూడా బాగున్నాయి. సినిమాలో చాలానే VFX వర్క్స్ ఉన్నాయి. డైరెక్టర్ శివ పునర్జన్మ నేపథ్యంలో ప్రస్తుత కథకు, వెయ్యేళ్ళ క్రితం కథకు లింక్ చేసి కొత్తగా చూపించారు. ఇక నిర్మాణ పరంగా తమిళ్ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్, తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కలిసి భారీగానే ఈ సినిమాకు ఖర్చుపెట్టారు. తెరపై ఆ నిర్మాణ విలువలు, ఆ భారీతనం తెలుస్తుంది.
మొత్తంగా ‘కంగువ’ సినిమా పునర్జన్మ నేపథ్యంలో యాక్షన్ ఫిలింగా తెరకెక్కింది. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.