Matka : మట్కా’ మూవీ రివ్యూ.. రొటీన్ కథకు వరుణ్ తేజ్ నట విశ్వరూపం..
ఏమి లేని వాడు ఏం చేసైనా సరే ఎదగాలి అనే కథనంలో మట్కా అనే గేమ్ ని జోడించి చూపించారు.

Varun Tej Meenakshi Chaudhary Matka Movie Review and Rating
‘Matka Movie Review : వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘మట్కా’. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కింది. జాన్ విజయ్, కిషోర్ కుమార్, నోరా ఫతేహి, నవీన్ చంద్ర.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు ఏజ్ గ్రూప్ లలో కనిపించాడు. మట్కా అనే గేమ్ ఆధారంగా డాన్ గా ఎదిగిన ఓ వ్యక్తి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. మట్కా సినిమా నేడు నవంబర్ 14న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. బర్మా నుంచి వలసదారులుగా వస్తారు వాసు(వరుణ్ తేజ్) కుటుంబం. అన్నం కోసం ఒకర్ని చంపి జైలుకు వెళ్తాడు వాసు. అక్కడ జైలర్ వాసు బలం మీద నమ్మకంతో కుస్తీ పోటీలు పెట్టి డబ్బులు సంపాదిస్తాడు. పెద్దయ్యాక జైలు నుంచి బయటకు వచ్చాక వాసు ఓ మార్కెట్ లో అప్పల రెడ్డి(అజయ్ ఘోష్)కి సహాయం చేసి అతని కొబ్బరికాయల బిజినెస్ లో పార్ట్నర్ అవుతాడు. అదే సమయంలో సుజాత(మీనాక్షి)తో ప్రేమలో పడతాడు. ఆ మార్కెట్ నడిపే KB(జాన్ విజయ్) మనుషులను కొట్టడంతో నాని బాబు(కిషోర్ కుమార్) వాసుని దగ్గరికి తీసుకుంటాడు.
నాని బాబు సపోర్ట్ తో వాసు బాగా ఎదుగుతాడు. ఈ క్రమంలో ముంబైకి వెళ్తే అక్కడ ఓ ఆట చూసి అలాంటిదే మట్కా అనే కొత్త గ్యాంబ్లింగ్ గేమ్ కనిపెడతాడు. ఆ మట్కా గేమ్ ని దేశమంతా విస్తరించి బాగా డబ్బులు సంపాదిస్తాడు. ఓ రోజు తన భార్య, తల్లిని ఎవరో చంపేయడం, తన డబ్బులను CBI పట్టుకోవడంతో వాసు ఏం చేసాడు? వాసు భార్య, తల్లిని ఎవరు చంపారు? అసలు ఈ మట్కా గేమ్ ఏంటి? వాసు ఈ గేమ్ ని ఎలా దేశమంతా విస్తరించాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Unstoppable Season 4 : బాలయ్య షోలో ప్రభాస్ గురించి అల్లు అర్జున్ ఏం చెప్పారో తెలుసా?
సినిమా విశ్లేషణ.. అప్పుడెప్పుడో నాయగన్ నుంచి ఇటీవల వచ్చిన పుష్ప వరకు చాలా సినిమాల్లో ఒకే కథలు. ఏమి లేని పేద వాడు కసితో డబ్బుల కోసం ఏదైనా చేసి ఎదగాలి అని ఎదగడం. మట్కా సినిమా కూడా అదే కథ. అయితే ఈ కథకు మట్కా గేమ్ అనే కొత్త పాయింట్ జోడించారు. మట్కా గేమ్ ని కొంచెం బాగానే అర్థమయ్యేలా చెప్పినా ఇంకా క్లియర్ గా చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇక కథనం అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. వాసు రావడం వరుసగా ఒక అవకాశం తర్వాత ఒక అవకాశం అందిపుచ్చుకొని ఎదగడం. కథ, కథనంలో కొత్తదనం అయితే లేదు.
కథ ఓ 30 ఏళ్ళ టైం పీరియడ్ తో సాగుతుంది. డైరెక్టర్ తాను చెప్పాలనుకున్నది సంవత్సరాల నెంబర్లు వేస్తూ కథ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఆ కథని చాలా చోట్ల ఇది ఎలా జరిగింది అనే డౌట్ రావడం సహజం. ఇందులో భార్య, పాప ఎమోషన్ ఉన్నా అంతగా పండలేదు. ఒక క్రిమినల్ ని హీరోగా చూపిస్తే అతని ఎమోషన్ మనకి కనెక్ట్ అయినప్పుడే అతను హీరోగా కనిపిస్తాడు. దీనికోసం ఒక సీన్ పెట్టుకొని చెప్పాలని ప్రయత్నించాడు. ఆ చెప్పే కథ కూడా గతంలో చాలా సినిమాల్లో ఉన్నదే. ప్రమోషన్స్ లో దర్శకుడు మట్కా అని ఒక చిన్న కథగా రాసుకున్నాను, మొదట ఇది సినిమా కథ అవుతుంది అనుకోలేదు అన్నాడు. అది సినిమా కథ చేయకుండా ఉండాల్సింది. మట్కా పాయింట్ ని చెప్పడానికి కథకు అటు ఇటు చాలానే సాగదీశారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సినిమాకు వరుణ్ తేజ్ చాలా ప్లస్ అయ్యాడు. వరుణ్ తన నట విశ్వరూపం చూపించాడు అని చెప్పొచ్చు. కుర్రాడి నుంచి ముసలివాడు వరకు నాలుగు ఏజ్ గ్రూప్ లలో పర్ఫెక్ట్ గా సెట్ అయి తన నటనతో మెప్పించాడు. ముసలి గెటప్ లో అయితే పర్ఫెక్ట్ డాన్ అనిపించాడు. మీనాక్షి చౌదరి సింపుల్ గా మెప్పించింది. కిషోర్ కుమార్ రెండు షేడ్స్ లో నటించి మెప్పిస్తాడు.
అజయ్ ఘోష్, సత్యం రాజేష్ పలువురు వరుణ్ టీమ్ లో మెంబర్స్ లాగా మెప్పించారు. ఒకప్పటి హీరోయిన్ సలోని ఓ చిన్న పాత్ర చేసింది. అసలు ఆ పాత్రకు మాములు జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరిపోతారు కానీ సలోనిని ఎందుకు తెచ్చారో డైరెక్టర్ కే తెలియాలి. నోరా ఫతేహి తన అందంతో పాటు నటనతో కూడా అలరిస్తుంది. జాన్ విజయ్, రవి శంకర్, అచ్యుత్ కుమార్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. చాలా సీన్స్ లో అప్పటి కాలానికి తగ్గట్టు కలర్ గ్రేడింగ్ పర్ఫెక్ట్ గా చేసారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడింది. ఓ పెద్ద మార్కెట్, బార్ సెట్ వేశారు. ఇక ఆ కాలానికి సంబంధించిన చాలా ప్రాపర్టీని బాగానే సేకరించారు. కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా వరకు అప్పటి కాలానికి సూట్ అయినా కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఇప్పటి కాస్ట్యూమ్స్ అని తెలిసిపోతుంది. దర్శకుడు తనకొచ్చిన ఓ మట్కా అనే చిన్న పాయింట్ ని సింపుల్ కథనంతో సాగదీసి చెప్పాడు. నిర్మాతలు మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు. తెరపై ఆ గ్రాండియర్ కనిపిస్తుంది.
మొత్తంగా ‘మట్కా’ సినిమా ఏమి లేని వాడు ఏం చేసైనా సరే ఎదగాలి అనే కథనంలో మట్కా అనే గేమ్ ని జోడించి చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.