Tamannaah: రచయితగా మారిన మిల్కీబ్యూటీ.. మార్కెట్‌లోకి ఎప్పుడంటే?
కరోనా మహమ్మారి చాలా మందికి చాలా రకాలుగా మార్చేసింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు చాలా మంది సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరవడంతో పాటు సమాజాన్ని కాస్త నిశితంగా చూడగలిగారు.

Tamannaah
Tamannaah: కరోనా మహమ్మారి చాలా మందికి చాలా రకాలుగా మార్చేసింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు చాలా మంది సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరవడంతో పాటు సమాజాన్ని కాస్త నిశితంగా చూడగలిగారు. మరికొందరైతే వారిలో ఉన్న కొత్త కొత్త కోణాలను బయటకు తీశారు. హీరోయిన్స్ కొందరు ఇప్పటికే కలం పట్టి రచయితలు మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంకచోప్రా కొన్ని నెలల క్రితం ‘అన్‌ఫినిష్డ్’ పేరుతో తన బయోపిక్‌ను వెలువరించగా.. మరో టాప్ స్టార్ కరీనా కపూర్ గర్భిణీ స్త్రీలపై ప్రెగ్నెన్సీ బైబిల్ పుస్తకాన్ని తెచ్చింది.
కాగా, ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే బాటలో రచయితగా మారింది. అది కూడా భారత సంస్కృతిలో ప్రాచీన జీవన విధానం మీద ఈ పుస్తకాన్ని రాయడం విశేషం. ‘బ్యాక్ టు ది రూట్స్’ అనే శీర్షికతో రాబోతున్న ఈ పుస్తకాన్ని తమన్నా లైఫ్ స్టైల్ కోచ్ ల్యూక్ కోటిన్‌హోతో కలిసి రాసింది. ప్రాచీన భారతీయ జీవన విధానం యొక్క గొప్పదనం, శారీరకధారుడ్యం కోసం ఆనాడు ఆచరించిన పద్ధతులు, సుదీర్ఘ జీవనానికి పాటించాల్సిన నియమాల్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ప్రస్తుతం సమాజంలో మనుషులు మర మనుషులుగా మారిపోయి ఉరుకులు పరుగులు, ఒత్తిడితో కూడుకున్న జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఈ వ్యవహారాల నుంచి ఉపశమనం పొందాలంటే మన భారతీయ ప్రాచీన మూలాల్లోకి వెళ్లాల్సిన అవశ్యకతను ఈ పుస్తకంలో తెలియజెప్పినట్లుగా తమ్మూ చెప్పుకొచ్చింది. కేవలం శారీరకదృఢత్వం గురించే కాకుండా సాత్విక ఆహార నియమాల్ని కూడా వివరించిన ఈ పుస్తకాన్ని ఓ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ద్వారా త్వరలోనే మార్కెట్‌లోకి రానుందట.