Tollywood Heros : నిర్మాతలుగా మారి బిజీ అవుతున్న హీరోలు..

హీరోలు కూడా ప్రొడ్యూసర్ల అవతారమెత్తి సూపర్ డూపర్ హిట్టు సినిమాల్ని అందిస్తున్నారు.

Tollywood Heros : నిర్మాతలుగా మారి బిజీ అవుతున్న హీరోలు..

Tollywood Heros Busy as Producers with Movies

Updated On : March 9, 2025 / 2:16 PM IST

Tollywood Heros : హీరోలు ప్రొడ్యూసర్లుగా మారడం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల నుంచి ఇప్పుడు కొత్త హీరోల వరకు చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారారు. ఇప్పుడు స్టార్‌ హీరోలతో పాటు పలువురు కుర్రహీరోలు సైతం సొంత నిర్మాణ సంస్థలు ఓపెన్ చేసేశారు. యంగ్ హీరోలు కూడా ప్రొడ్యూసర్ల అవతారమెత్తి సూపర్ డూపర్ హిట్టు సినిమాల్ని అందిస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ తన తండ్రి చిరంజీవి మూవీ కోసం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ అనే సంస్థను స్థాపించి.. చిరుతో ఖైదీ నెంబర్150, సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్ లాంటి సినిమాల్ని నిర్మించారు. అయితే ఇన్నాళ్లు తన తండ్రి చిత్రాలకే నిర్మాతగా వ్యవహరించిన చరణ్‌.. తొలిసారి ఓ బయట హీరోనిపెట్టి సినిమా తీస్తున్నారు. నిఖిల్‌ హీరోగా ‘ది ఇండియా హౌస్‌’ అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. రామ్‌ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని స్వయంగా నిర్మిస్తున్నారు రామ్‌చరణ్‌. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాదే తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read : Tollywood Promotions : ప్రమోషన్స్ లో కొత్త ట్రెండ్ తెస్తున్న టాలీవుడ్.. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి..

ఓవైపు హీరోగా.. మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు న్యాచురల్ స్టార్ నాని. ఆయన ఇప్పటికే ‘అ!’, ‘హిట్‌’, ‘హిట్‌ 2’ సినిమాలు చేసి నిర్మాతగా మెప్పించారు. ఇప్పుడు హిట్-3 సినిమాను కూడా తన నిర్మాణంలోనే తీస్తున్నారు. అలాగే ప్రియదర్శి హీరోగా కోర్ట్ అనే మూవీని కూడా నిర్మించారు నాని. ఈ మూవీ ఈ నెల 14న రిలీజ్ కానుంది. మరోవైపు నాని ఏకంగా తన అభిమాన హీరో చిరంజీవి సినిమాని నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. దసరా ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్ లో చిరు మూవీ ఉంటుందని లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అనౌన్స్ చేశారు.

హీరో రానాకు మంచి అభిరుచి గల నిర్మాతగా స్పెషల్ క్రేజ్‌ ఉంది. ఆయన సమర్పణలో వచ్చిన కేరాఫ్‌ కంచరపాలెం, కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా, 777 చార్లీ, గార్గీ, కీడా కోలా, 35 చిన్న కథ కాదు లాంటివి సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడాయన నిర్మాణంలో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. వాటిలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వస్తున్న పాన్‌ ఇండియా మూవీ కాంత కూడా ఉంది. సెల్వమణి సెల్వరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దుల్కర్‌ కూడా ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇదే కాకుండా విశ్వదేవ్‌ రాచకొండ డార్క్‌ చాక్లెట్,‌ ప్రియదర్శి నటిస్తున్న ‘ప్రేమంటే?’ సినిమాలు రానా సమర్పణలోనే రానున్నాయి.

Also Read : Anchor Rashmi : అస్థికలను గోదావరిలో కలిపి ఎమోషనల్ పోస్ట్ చేసిన యాంకర్ రష్మీ.. ఎవరి అస్థికలు అంటే..

కల్యాణ్‌ రామ్‌ ఎప్పట్నుంచో నిర్మాతగానూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ‘దేవర’తో నిర్మాతగా మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇప్పుడు తన సొంత సంస్థలో ‘ఎన్టీఆర్‌ నీల్‌’తో పాటు ‘బింబిసార’ ప్రీక్వెల్‌ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. వీటిలో ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ల చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇలా చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారడంతో మంచి మంచి స్టోరీలు ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాయి.