టాలీవుడ్ థ్రిల్లర్స్.. బాలీవుడ్ రీమేక్..

మన తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే పలు తెలుగు మూవీస్ బాలీవుడ్‌లో రీమేక్ కావడం, అక్కడ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకోవడం అనేది ఇటీవల కాలంలో సర్వసాధారణం అయిందనే చెప్పాలి. తాజాగా మరో రెండు తెలుగు సినిమాలు హిందీనాట రీమేక్ కానున్నాయి. అవి రెండూ థ్రిల్లర్సే కావడం విశేషం.
విశ్వక్‌సేన్ హీరోగా, నేచురల్ స్టార్ నిర్మాతగా తెరకెక్కిన కాప్ థ్రిల్లర్ ‘HIT’.. శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేసింది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించి మరో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడీ చిత్రం హిందీ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించనుంది. యువనటుడు రాజ్ కుమార్ రావు హీరోగా నటించనున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కుల్‌దీప్ రాథోర్, దిల్ రాజు కలిసి నిర్మించనున్నారు. శైలేషే హిందీలోనూ డైరెక్ట్ చేయనున్నాడు. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుపుతామని మేకర్స్ చెప్పారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా పరిచయమైన చిత్రం ‘మత్తు వదలరా’. గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిందీ చిత్రం. రితేశ్ రానా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు రితేశ్ రానా ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. బాలీవుడ్‌లోనూ రితేశ్ రానానే డైరెక్ట్ చేయనున్నారట. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీ ఆడియెన్స్‌కు తగినట్లు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నారట రితేశ్. కీరవాణి మరో తనయుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.