ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ నటుడు సంతు ముఖోపాద్యాయ్ గుండెపోటుతో మరణించారు..

  • Published By: sekhar ,Published On : March 12, 2020 / 07:16 AM IST
ప్రముఖ నటుడు కన్నుమూత

Updated On : March 12, 2020 / 7:16 AM IST

ప్రముఖ నటుడు సంతు ముఖోపాద్యాయ్ గుండెపోటుతో మరణించారు..

ప్రముఖ బెంగాలీ నటుడు సంతు ముఖోపాద్యాయ్(69) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంతు ముఖోపాద్యాయ్ గుండెపోటుతో బుధవారం (మార్చి 11) సాయంత్రం దక్షిణ కోల్‌కతాలోని స్వగృహంలో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.. స్వస్థిక ముఖర్జీ నటిగా కెరీర్ కొనసాగిస్తుండగా అజోపా ముఖర్జీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. 1951లో జన్మించిన సంతు ముఖోపాద్యాయ్ 24వ ఏట తపన్ సిన్హా దర్శకత్వం వహించిన ‘రాజా’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు.

‘గంగా దేవత’, ‘హార్మోనియం’, ‘భాలోబాసా భాలోబాసా’, ‘ప్రతిమ’, ‘ప్రఫుల్లా’ వంటి పలు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెంగాలీ చిత్ర పరిశ్రమ లెజెండ్స్ ఉత్తమ్ కుమార్, సౌమిత్రా చటర్జీ వంటి వారితో కలిసి నటించారాయన.

సుధీర్ఘకాలంగా క్యాన్సర్‌, దానికితోడు విపరీతంగా బీపీ పెరగడం, హైపర్ టెన్షన్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి తీసుకురాగా గుండెపోటుతో మరణించారు. సంతు ముఖోపాద్యాయ్ మృతి పట్ల బెంగాలీ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్ మంత్రి అరూప్ బిశ్వాస్ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.