ప్రసిద్ధ నటుడు అస్రానీ ఇకలేరు.. ఆయన 5 దశాబ్దాల సినీ ప్రస్తానాన్ని గుర్తుచేసుకుంటున్న బాలీవుడ్

మరణానికి కొన్ని గంటల ముందు కూడా తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రసిద్ధ నటుడు అస్రానీ ఇకలేరు.. ఆయన 5 దశాబ్దాల సినీ ప్రస్తానాన్ని గుర్తుచేసుకుంటున్న బాలీవుడ్

Updated On : October 21, 2025 / 8:11 AM IST

Govardhan Asrani: బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రానీ (84) కన్నుమూశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన అస్రానీ ఐదు దశాబ్దాలకుపైగా సినీ రంగంలో ఉన్నారు. తన కెరీర్‌లో 350కి పైగా సినిమాల్లో నటించారు. 1970 దశకపు ప్రారంభంలో ‘మేరే అప్నే’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ హాస్యనటుడు కొంతకాలంగా వృద్ధాప్య వ్యాధులతో పోరాడారు.

మరణానికి కొన్ని గంటల ముందు కూడా తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ముంబై సాంటాక్రూజ్ శ్మశానవాటికలో కుటుంబసభ్యుల సమక్షంలో అస్రానీ అంత్యక్రియలు జరిగాయి. (Govardhan Asrani)

“ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. వైద్యులు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని చెప్పారు” అని అస్రానీ మేనేజర్ బాబుభాయ్ థిబా తెలిపారు.

చార్లీ చాప్లిన్ నటించిన ‘ది గ్రేట్ డిక్టేటర్’ పాత్రను అనుకరిస్తూ 1975లో విడుదలైన ‘షోలే’ సినిమాలో “జైలర్” పాత్రతో అస్రానీ అలరించారు. భారత ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించారు. ఈ సినిమాలో తక్కువసేపే కనిపించినా, ఆయన చెప్పిన “హమ్ ఆంగ్రేజోన్ కే జమానే కే జైలర్ హైన్” అనే డైలాగ్ ను బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌.. ఎల్లో అలర్ట్.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

ఆగస్టులో ‘షోలే’ 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అస్రానీ మాట్లాడుతూ.. “ఎటువంటి వేడుకకు వెళ్లినా జైలర్ డైలాగ్ చెప్పాలని అడుగుతారు. ఇది సిప్పీ సాబ్ దర్శకత్వం, సలీమ్ జావేద్ రచన వల్ల సాధ్యమైంది” అని అన్నారు.

1970, 1980 దశకాల్లో అస్రానీ హిందీ సినిమాల్లో ప్రధాన హాస్యనటుడిగా మారారు. హృషీకేశ్ ముఖర్జీ, బాసు చటర్జీ, బీఆర్ చోప్రా, కేఆర్ రావు వంటి దర్శకులు తమ సినిమాల్లో అస్రానీకి తప్పకుండా ఓ పాత్ర ఇచ్చేవారు.

‘షోలే’తో పాటు ‘అభిమాన్’, ‘ఆజ్ కీ తాజా ఖబర్’, ‘బాలికా బధు’ సినిమాల్లో అస్రానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. టెలివిజన్‌లోనూ ఆయన ప్రేక్షకాదరణ పొందారు. 1985లో దూరదర్శన్ ప్రసారమైన ‘నటఖట్ నారద్’ సీరియల్‌లో నారదుడి పాత్రలో కనిపించారు.

భారత సినిమాలలో అరుదైన రికార్డు అస్రానీదే. ఆయన ఒక దశాబ్దంలో అత్యధిక హిందీ చిత్రాలలో నటించిన హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు. 1970ల్లో 101 సినిమాలు, 1980ల్లో 107 చిత్రాలలో నటించారు. అస్రానీ నటుడిగానే కాకుండా, రచయిత, దర్శకుడిగానూ రాణించారు. గోవర్ధన్ అస్రానీ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 5 దశాబ్దాల ఆయన సినీ ప్రస్తానాన్ని గుర్తుచేసుకుంటున్నారు.