ప్రముఖ నటి శాంతమ్మ కన్నుమూత..

ప్రముఖ కన్నడ నటి శాంతమ్మ (95) ఆదివారం రాత్రి కన్నుమూశారు. సీనియర్ నటి అయిన శాంతమ్మ శాండల్ వుడ్‌లో దాదాపు 400 లకు పైగా సినిమాల్లో నటించారు. వయో భారం కారణంగా శాంతమ్మ మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మైసూర్ నగరంలో నివాసముండే శాంతమ్మ శనివారం ఇంట్లో సృహతప్పి పడిపోవడంతో ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. శాంతమ్మ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు.
1956లో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించిన ‘Ohileshwara’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన శాంతమ్మ అంతకుముందు పలు నాటకాలు కూడా వేశారు. ఆమె రాజ్ కుమార్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు.. రాజ్ కుమార్‌తో కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. పలువురు కన్నడ సినీ నటులు శాంతమ్మకు నివాళులు అర్పించారు. ఈ లాక్‌డౌన్ సమయంలో కమెడియన్ బుల్లెట్ ప్రకాష్, చిరంజీవి సర్జా, మిమిక్రీ రాజగోపాల్, మెబీనా మైఖేల్, మైఖేల్ మధు వంటి పలువురు సినీ నటులు కన్నుమూయడంతో కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర ఆందోళనకు గురవుతోంది.