MAA Election: ‘మా’లో హేమ వ్యాఖ్యల ప్రకంపనలు..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA)లో మళ్లీ ఎన్నికల రగడ మొదలైంది. ఆ మధ్య రేగిన ఎన్నికల అలజడి ఎంతటి వివాదాస్పదమైందో తెలిసిందే. కొద్దిరోజుల విరామం అనంతరం మళ్ళీ ఎన్నికల హడావుడి అంటూ ప్రచారం జరుగుతుండగా ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్ పై నటి హేమ సంచలన ఆరోపణలు చేశారు. హేమ విడుదల చేసిన వాయిస్ మెసేజ్ పై ఇప్పుడు 'మా'లో దుమారం రేగుతుంది.

Maa Election
MAA Election: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA)లో మళ్లీ ఎన్నికల రగడ మొదలైంది. ఆ మధ్య రేగిన ఎన్నికల అలజడి ఎంతటి వివాదాస్పదమైందో తెలిసిందే. కొద్దిరోజుల విరామం అనంతరం మళ్ళీ ఎన్నికల హడావుడి అంటూ ప్రచారం జరుగుతుండగా ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ పై నటి హేమ సంచలన ఆరోపణలు చేశారు. కొత్తగా ఫండ్స్ తీసుకురాకుండానే.. పాత ఫండ్ మొత్తం తినేశారని.. ఎన్నికలు జరపకుండా తానే అధ్యక్షుడిగా కొనసాగేలా నరేశ్ చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు హేమ ఓ వాయిస్ మెసేజ్ విడుదల చేశారు.
హేమ విడుదల చేసిన వాయిస్ మెసేజ్ పై ఇప్పుడు ‘మా’లో దుమారం రేగుతుంది. హేమ వ్యాఖ్యలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నరేష్, జీవితా రాజశేఖర్ ఖండించారు. తాము ‘మా’ ఫండ్స్ తినేశాం అనే హేమ ఆరోపణలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుటుంబానికి పెద్ద నష్టం అన్నారు. జూలై 29 డిసిప్లేనరీ కమిటీ అధ్వర్యంలో వర్చువల్ మీటింగ్ జరగగా.. కరోనా టైంలో ఎలక్షన్స్ నిర్వహించకూడదని పలు కోర్టుల తీర్పులను గౌరవించి ఎన్నికల జరపలేదన్నారు. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలక్షన్స్ జరపడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
‘మా’ దివాలా తీసే విధంగా వుందని హేమ వాయిస్ మెసేజ్ విని తాము షాక్ అయ్యామన్న నరేష్ ‘మా’లో ప్రస్తుతం దాదాపు 4.70 కోట్లు ఫండ్ ఉందన్నారు. మా ఫండ్ ను టచ్ చెయ్యకుండానే మాకున్న ఇమేజ్ తో ఫండ్ తెచ్చుకుని కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ‘మా’ సభ్యుల కోసం ఎన్నో పనులు చేశామన్నారు. ఇండస్ట్రీ పెద్దలు, ఫ్రెండ్స్ మాకు ఫండ్స్ విషయంలో సహకరించారు. పేద కళాకారులను ఆదుకుంటూ.. ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రుళ్ళు కూడా స్పందించామన్నారు. చిరంజీవి గారు మమ్మల్ని అభినందిస్తూ మెసేజ్ పెట్టారని గుర్తు చేశారు. ‘మా’ ఫండ్ డ్రా చెయ్యాలంటే ముగ్గురు సంతకాలు వుండాలన్న నరేష్.. నేను, జీవిత, ట్రెజరర్ కలిసి ఫండ్స్ తినేశామా? అని ప్రశ్నించారు. హేమ ఆరోపణలు చాలా బాధాకరమని పేర్కొన్న నరేష్ రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల గురించి డిసిప్లీనరీ కమిటీ ముందు పెడతామని చెప్పారు.
జీవితా మాట్లాడుతూ.. మీడియా ముందు రాకుండానే సమస్యలను పరిష్కరించుకోవాలని ‘మా’లో నియమం ఉంటుందని.. కానీ, హేమ వ్యాఖ్యలతో మీడియా ముందుకు రాక తప్ప లేదన్నారు. హేమ ఆరోపణలకు వివరణ ఇవ్వకపోతే ఆ ఆరోపణలు నిజం అనుకొనే ప్రమాదం వుందనే ఇప్పుడు ఇలా స్పందించాల్సి వచ్చిందని.. హేమ మాటలు చాలా తప్పుగా అనిపించాయని.. ‘మా’లో ఏదైనా అందరూ కలిసే నిర్ణయించుకోవాలని.. హేమ ఆ నిర్ణయాలను పట్టించుకోకుండా ఇలా మీడియాకి ఎక్కడ ఏం అవసరం వచ్చిందని ప్రశ్నించారు. ఎలక్షన్స్ నిర్వహించకూడదని ఎవరూ అనుకోవడం లేదని.. దేని కోసం ఇలా ‘మా’ సభ్యులను కన్ఫ్యుజ్ చేస్తున్నారని ప్రశ్నించారు. తాము కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టడం లేదని.. ‘మా’ హయంలో కోటి రూపాయలు ఫండ్ సమకూర్చి ఖర్చు పెడుతున్నామన్నారు.