Vijay Deverakonda : వివాదం పై క్లారిటీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు..

రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి.

Vijay Deverakonda : వివాదం పై క్లారిటీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు..

Vijay Deverakonda Clarifies No Brother_Sister should misunderstand his statement

Updated On : May 3, 2025 / 1:18 PM IST

Vijay Deverakonda: త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్‌ను ఇటీవ‌ల ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఐదు వందల ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు.. పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి అని అన్నాడు. విజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు గిరిజ‌నుల‌ను అవ‌మానించే ఉన్నాయ‌ని, వెంట‌నే అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ పోలీసుల‌కు ఫిర్యాదులు సైతం అందాయి.

తాజాగా.. తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ క్లారిటీ ఇచ్చాడు. త‌న ఉద్దేశం ఎవ‌రినీ బాధ‌పెట్ట‌డం కాద‌న్నాడు. ‘రెట్రో ఈవెంట్ లో నేను చేసిన వ్యాఖ్య‌లు కొంద‌రి మ‌నో భావాల‌ను దెబ్బ‌తీసిన‌ట్లుగా నా దృష్టికి వ‌చ్చింది. ఏ వ‌ర్గాన్నీ, ఏ తెగ‌నూ బాధ‌పెట్ట‌డం నా ఉద్దేశ్యం కాదు. వారిని నేను ఎంతో గౌర‌విస్తాను. భార‌త దేశంలోని ప్ర‌జ‌లంతా ఒక్క‌టే. మ‌నంమంద‌రం క‌లిసి కట్టుగా ముందుకు సాగిలి. ఐక్యంగా నిల‌బ‌డాలి.’ అని విజ‌య్ దేవ‌రకొండ అన్నాడు.

తాను ఏ స‌మూహంపై ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎప్పుడూ వివ‌క్ష చూప‌లేద‌ని చెప్పుకొచ్చాడు. వారంతా త‌న కుటుంబ స‌భ్యులు, సోద‌రులే అని అనుకుంటాన‌ని అన్నాడు. తాను చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల ఎవ‌రైనా బాధ‌ప‌డి ఉంటే విచారం వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా తెలిపాడు. శాంతి గురించి మాట్లాడ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నాడు.

‘చారిత్రక, నిఘంటువు దృష్టికోణంలో నేను ఆ ప‌దాన్ని ఉప‌యోగించాను. వంద‌ల ఏళ్ల కింద‌ట స‌మాజం, ప్ర‌జ‌లు గుంపులుగా వ్య‌వ‌స్థీకృత‌మై ఉండేవాళ్ల‌ని నాఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. అంతేకానీ.. ఇప్పుడున్న షెడ్యూల్‌ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. బ్రిటిష్‌ వారు భారత దేశాన్ని పాలించడం మొదలు పెట్టిన తర్వాత ఇలా వర్గీకరణ అనేది జరిగింది. అలా జరిగి కనీసం 100 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు.’ అని విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు.