Koratala Siva : కొరటాలతో పాటు మహేష్‌కి కూడా.. కోర్టు నోటీసు పంపించానంటున్న రచయిత..
‘శ్రీమంతుడు’ సినిమా విషయంలో కొరటాల శివతో పాటు మహేష్ బాబుకి కూడా కోర్టు నోటీసు పంపించినట్లు రచయిత శరత్ చంద్ర పేర్కొన్నారు.

Writer Sarath Chandra comments on Mahesh Babu Koratala Siva about srimanthudu issue
Koratala Siva : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. ‘శ్రీమంతుడు’ సినిమా విషయంలో క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అంటూ సుప్రీమ్ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు, టాలీవుడ్ లో సంచలనంగా మారింది. రచయిత శరత్ చంద్ర అనే వ్యక్తి స్వాతి పత్రికలో రాసిన కథని కాపీ కొట్టి కొరటాల శ్రీమంతుడు సినిమా తీసారని.. 2017లో నాంపల్లి కోర్టులో కేసు నమోదు అయ్యింది.
ఈ కేసు విషయంలో తాను నిర్దోషి అని నిరూపించుకోవడం కోసం కొరటాల శివ.. నాంపల్లి కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లారు. అయితే ప్రతి కోర్టులో కొరటాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల చివరిగా సుప్రీమ్ కోర్టు.. కొరటాల శివ క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసి తుది నిర్ణయాన్ని ఇచ్చేసింది. ఇక ఈ విషయం పై రచయిత శరత్ చంద్ర తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Also read : Kurchi Madathapetti Video Song : ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే.. “2012లో స్వాతి మాస పత్రికలో ‘చచ్చేంత ప్రేమ’ అనే టైటిల్ తో ఓ నవల రాశాను. ఆ కథ బాగా రావడంతో సినిమా చేయాలని భావించాను. ఈక్రమంలోనే సింహరాశి, ఎవడైతే నాకేంటి సినిమాలు డైరెక్ట్ చేసిన సముద్రను కలిసి, ఆ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి సిద్దమయ్యాను. అయితే అదే సమయంలో శ్రీమంతుడు రిలీజ్ అవ్వడం, అది చుసిన నా స్నేహితులు.. అది నా కథే అని చెప్పడంతో నేను చూశాను.
నా కథలోని ఊరు పేరు దగ్గర నుంచి కథని నడిపించడం వరకు ఉన్నది ఉన్నట్లు.. ఆ సినిమాలో చూసి షాక్ అయ్యాను. దీంతో కొరటాల శివని సంప్రదించి అది నా కథే అని చెప్పాను. కానీ, ఆయన అంగీకరించలేదు. ఆ తరువాత కొందరు సినీ పెద్దలు రాజీ కుదర్చడం కోసం రూ.15 లక్షలు ఇప్పెంచేందుకు ప్రయత్నించారు. కానీ నాకు కావాల్సింది డబ్బు కాదు. ఆ కథ నాదే అన్న పేరు.
అయితే కొరటాల శివ ఆ కథని కాపీ అని ఒప్పుకోకపోవడంతో కోర్టులో కేసు వేసాను. ఈక్రమంలోనే ఆ చిత్ర నిర్మాణంలో భాగం ఉన్న మహేష్ బాబు, మైత్రి నిర్మాత నవీన్ యెర్నేనికి కూడా కోర్టు నోటీసులు పంపించాను. కొన్నాళ్ళు కోర్టు రాకుండా గడిపిన మహేష్ బాబు.. ఆ తరువాత ఆ నిర్మాణంలో తమకి భాగస్వామ్యం లేదని కోర్టుకి తెలియజేసారు” అంటూ చెప్పుకొచ్చారు.
దీనికి మూవీ టీం కూడా రియాక్ట్ అవుతూ.. కేసు ఇంకా నడుస్తుంది. కాబట్టి అసలు విషయం ఏది తెలియకుండా, నిర్మాతలను, దర్శకులను బ్లేమ్ చేసేలా వార్తలు రాయొద్దు అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.