స్టూడెంట్స్ కాదంట: జామియా ఆందోళనలో 10మంది అరెస్టు

స్టూడెంట్స్ కాదంట: జామియా ఆందోళనలో 10మంది అరెస్టు

Updated On : December 17, 2019 / 6:38 AM IST

CAAపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఆదివారం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు కొద్ది గంటలు స్టేషన్ లో ఉంచి విడుదల చేసేశారు. వారిలో ఒక పది మందిని మాత్రం విడుదల చేయలేదు. జామియా, ఓఖ్లా ప్రాంతాలకు చెందిన ఆందోళనకారులుగా గుర్తించారు. వారిపై పలు రకాల కేసుల్లో నేర చరిత్ర ఉన్న వ్యక్తులుగా గుర్తించారు. 

 

అంతకంటే ముందు జామియా వైస్ చాన్సిలర్ నజ్మా అక్తర్ ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణ జరపాలంటూ ఆదేశించారు. ఆదివారం విద్యార్థులంతా సిటిజన్‌షిప్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ చేశారు. కొన్ని గంటల తేడాలోనే అల్లర్లు మొదలయ్యాయి. రెండు ద్విచక్రవాహనాలు, మూడు పబ్లిక్ బస్సులు, ఓ ట్రక్ మంటలు అంటించి తగులబెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి టియర్ గ్యాస్, లాఠీ ఛార్జీతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. 

 

ఈ ఘటనలో డజన్లలో స్టూడెంట్లు, కొందరు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ లో బుల్లెట్ గాయాలతో చికిత్స తీసుకుంటున్నారు. వారిద్దరూ అనుమతులు లేకుండా జామియా క్యాంపస్ లోకి చొరబడ్డారని పోలీసులు అంటున్నారు. 100మంది స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకున్నారు. జామియా, డీయూ, జేఎన్‌యూ విద్యార్థులంతా ఢిల్లీలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ముందు నిరసన చేపట్టారు. ఫలితంగా ఉదయం 3గంటల 30నిమిషాలకు విద్యార్థులను విడుదల చేశారు. 

 

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేవలం పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు మాత్రమే ఈ చర్యలకు పాల్పడినట్లు తెలిపారు. ‘అల్లర్లను అదుపుచేసి లా అండ్ ఆర్డర్ ను అదుపులోకి తీసుకురావాలనుకున్నాం. యూనివర్సిటీ విద్యార్థులతో ఎలాంటి సమస్య లేదు’ అని ఢిల్లీ సౌత్ ఈస్ట్ డీసీపీ చిన్మయ బిస్వాల్ అన్నారు.