Tribal Girl Gopika Govind : ఎయిర్ హోస్టెస్ అయిన గిరిజన బిడ్డ గోపికా గోవింద్
12 ఏళ్ల చిరుప్రాయంలో కన్న కల నిజమైంది. ఓ గిరిజన బాలిక ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసినప్పుడల్లా ఎయిర్ హోస్టెస్ అవ్వాలని అనుకుంది. అనుకోవటమే కాదు ఆ కలను సాకారం చేసుకోవటానికి కష్టపడింది. తన కలను నెరవేర్చుకుంది గిరిజన బిడ్డ గోపికా గోవింద్.

Kerala Tribal Girl Gopika Govind Became Air Hotess
Kerala Tribal Girl Gopika Govind Became Air Hotess : 12 ఏళ్ల చిరుప్రాయంలో కన్న కల నిజమైంది. ఓ గిరిజన బాలిక ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసినప్పుడల్లా అందులో విహరించటమే కాదు అందంగా ముస్తాబై ఎయిర్ హోస్టెస్ అవ్వాలని అనుకుంది.అనుకోవటమే కాదు ఆ కలను సాకారం చేసుకోవటానికి కష్టపడింది. తన కలను నెరవేర్చుకుంది. కేరళలోని కపుంకుడికి చెందిన గోపిక గోవింద్ (Gopika Govind). పేరుకు తగినట్లే అందమైన రూపం. కేరళలోని కపుంకుడి గోపిక సొంత ఊరు.
గోపిక పుట్టింది కరింబల అనే షెడ్యూల్డ్ తెగలో. అమ్మానాన్న కూలీపని చేసుకుంటారు. కష్టం చేసుకుంటేనే గడుస్తుంది. అలాంటి ఇంటిలో పుట్టిన తనకు ఆకాశంలో ఎగిరే విమానంలో ఉద్యోగం వస్తుందా? అనుకునేది. కానీ ఆ కల తనతోపాటే పెరిగింది. ఆ కలను నెరవేర్చుకోవాలనే తపన కూడా పెరిగింది. ఆకాశంలో విమానాల్ని చూసిన ప్రతిసారీ ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కలలుగనేది. కానీ అమ్మానాన్నలకు చెప్పే ధైర్యం చేయలేదు. కారణం వారి ఆర్థిక పరిస్థితి. ఆ భయంతోనే తన కలల్ని తనలోనే దాచేసుకునేది. కానీ ఎలాగైనా అవ్వాలనే పట్టుదల ఉండేది.
ఆ సమయంలో ఎస్టీ బాలికల కోసం ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ స్కాలర్ షిప్‌తో వాయనాడ్‌లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసుకుంది. ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించింది. ఈమధ్యే శిక్షణ కోసం ముంబై వెళ్లింది. గోపిక ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల తెగ పెద్దలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ హోస్టెస్‌గా విమానంలో చేరిన రాష్ట్రంలోనే మొదటి ఎస్టీ మహిళగా గోపికా గోవింద్ నిలిచింది. గోపిక అయితే.. అప్పుడే మేఘాల్లో తేలిపోతోంది. చిన్ననాటి కల ఈ రకంగా నెరవేరుతుందని ఆ చిరుప్రాయంలో బహుశా ఆమె అనుకోలేదు. కానీ కష్టపడితే ఫలితం దక్కుతుందని నిరూపించింది గోపిక. కలలు పెద్దవి కనాలి..వాటిని సాకారం చేసుకోవటానికి కృషి చేయాలని అబ్దుల్ కలాం చెప్పిన మాటలు గోపిక విషయంలో నెరవేరాయి.
పి గోవిందన్..విజిల కుమార్తె గోపిక గోవింద్ మాట్లాడుతూ..నేను ఆకాశాన్ని తాకాలని.. ఎయిర్ హోస్టెస్‌ని కావాలని చిన్ననాటినుంచే కలకన్నాను. ఆ కలను సాకారం చేసుకున్నానంటూ సంతోషంలో తేలిపోతు చెబుతోందీ గిరిజన బిడ్డ. ఆ సంతోషం ఆకాశమే హద్దుగా ఉంది. నాకు చిన్నప్పటినుంచి అటువంటి ఆశ ఉందని ఎవ్వరికి చెప్పలేదు. ఆఖరికి నా తల్లిదండ్రులకు కూడా తెలియదు..కానీ నా కల నెరవేరింది అనిచెబుతోందీ గోపికా గోవింద్.
నా కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి నాకు తెలుసు. అందుకే చెప్పలేదు. కానీ ఎస్టీ బాలికల విద్య కోసం ప్రభుత్వ పథకం గురించి తెలిసింది. దానికిగురించి తెలుసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నా కోర్సు ఫీజు రూ.లక్ష చెల్లించింది. ఇలా అందరి సహకారంతో నా కలను నెరవేర్చుకున్నానని తెలిపింది గోపికా గోవింద్. బుధవారం (ఆగస్టు 31,2022) ప్రభుత్వ పథకంలో చదివిన ఎస్టీ విద్యార్థులకు ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈవెంట్ తర్వాత.. గోపిక ఎయిర్ ఇండియాలో శిక్షణ పూర్తి చేయడానికి ముంబైకి వెళ్లింది.