Terrorists At LoC : కశ్మీర్‌లో చోరబడేందుకు బోర్డర్ వద్ద 140 మంది ఉగ్రవాదులు!
జమ్మూ కశ్మీర్‌లో చొరబడడానికి సరిహద్దు అవలి వైపున ఉన్న లాంచ్‌ప్యాడ్‌ల దగ్గర దాదాపు 140 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని భద్రతా దళాలకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు.

Border2 (1)
Terrorists At LoC జమ్మూ కశ్మీర్‌లో చొరబడడానికి సరిహద్దు అవలి వైపున ఉన్న లాంచ్‌ప్యాడ్‌ల దగ్గర దాదాపు 140 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని భద్రతా దళాలకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు. అయితే, ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడకుండా సైన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసకుంటోందని తెలిపారు. పటిష్ఠమైన చొరబాట్ల నిరోధక భద్రతా వ్యవస్థ కారణంగా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడే సాహసం చేయలేకపోతున్నారని ఆయన చెప్పారు. గతంలో కశ్మీర్ లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారని కానీ అప్రమత్తంగా ఉన్న జవాన్లు వారి కుటిల యత్నాలను భగ్నం చేయడంతో వారు మళ్లీ అలాంటి యత్నాలు చేయలేదని అధికారి చెప్పారు.
కాగా,ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాద శిక్షణా స్థావరాలు ఇప్పటికీ యధావిధిగా కొనసాగుతున్నాయని ఉన్నతాధికారి తెలిపారు. గతేడాది నియంత్రణ రేఖ వెంబడి పౌర నివాస ప్రాంతాలపై పాక్ సైన్యాల కాల్పులు, శతఘ్ని దాడుల కారణంగా మన సైన్యం జరిపిన దాడుల్లో ధ్వంసమైన తమ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవడానికి పాక్ కాల్పుల విరమణను ఒక అవకాశంగా ఉపయోగించుకుంటున్నట్లె ఆయన చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందం భారత్ కంటే పాకిస్తాన్ కి చాలా ముఖ్యమని, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ‘గ్రే’ జాబితాలో నుంచి బయటపడేందుకు కాల్పులు విరమణ ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉండటం అత్యంత ప్రాధాన్యమైన అంశమని సదరు అధికారి తెలిపారు. ఉగ్రవాదులకు సంబంధించిన మౌలిక వసతులను తొలగిస్తే..ఈ విషయంలో పాక్ నిబద్ధత నిరూపితమవుతుందన్నారు.
జమ్ముకశ్మీర్‌కు రెండేళ్ల క్రితం ప్రత్యేక హోదాను కేంద్రప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి విదేశీ ఉగ్రవాదులు కనమరుగయ్యారని చెప్పారు. రహస్య ప్రదేశాల్లో వారు దాక్కొని ఉండవచ్చని ఆ అధికారి చెప్పారు. కాగా స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరడం గురించి మాట్లాడుతూ.. ఆయుధాలు చేతబట్టడం లేదా, దేశానికి వ్యతిరేకంగా కుట్రపూరిత కార్యకలాపాల్లో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్న వారు అలాంటి ఆలోచనలు మానుకోవాలని, అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామనే సందేశాన్ని నిరంతరం ఇస్తూనే ఉన్నామని.. ఇది సత్ఫలితాలను ఇచ్చిందని కూడా ఆయన చెప్పారు. స్థానికులెవరూ ఉగ్రవాదులతో చేతులు కలపకుండా ఉండేలా.. వారి మానసిక స్థితిని మార్చేందుకు సైన్యం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.