18 కోట్ల భారతీయుల్లో ఇప్పటికే కరోనా యాంటీబాడీస్

  • Published By: venkaiahnaidu ,Published On : July 22, 2020 / 05:27 PM IST
18 కోట్ల భారతీయుల్లో ఇప్పటికే కరోనా యాంటీబాడీస్

Updated On : July 22, 2020 / 6:12 PM IST

దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ కట్టడిలో విఫలమవుతున్నాయి. లక్ష కేసులు నమోదవడానికి మూడు రోజులు మాత్రమే పడుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 11లక్షలు దాటాయి. 28000 మంది ఇప్పటివరకు మృతి చెందారు. అయితే ఊరట కలిగించే విషయం ఏమిటంటేకరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది.

ఈ సమయంలో ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్ థైరోకేర్…యాంటీబాడీలపై ఓ నివేదికను వెల్లడించింది. 18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని థైరోకేర్ డేటా వెల్లడించింది. దేశంలో దాదాపు 15 శాతం మంది కరోనావైరస్ కు వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి వుండవచ్చని తమ డేటా సూచిస్తుందని తెలియజేసింది. ఈ డేటా ప్రకారం…యాంటీబాడీలను డెవలప్ చేసిన లిస్ట్ లో థానేలోని బివాండీ టాప్ లో ఉంది. ఆ తర్వాత బెంగుళూరులోని పీణ్య ఆ తర్వాత స్థానంలో ఉంది.

దేశంలోని 600 ప్రాంతాల్లో 60 వేల మందిపై సుమారు 20 రోజుల పాటు యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించి ఈ నివేదికను వెల్లడించింది. దేశంలో దాదాపు 15 శాతం మందిలో ఇప్పటికే ప్రతినిరోధకాలు(antibodies)అభివృద్ధి అయినట్లు తెలుస్తోందని స్టడీ తెలిపింది. ఈ విషయాన్ని థైరోకేర్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ వెలుమని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తమ అంచనాల్లో 3శాతం అటూఇటుగా ఉండవచ్చని తెలిపారు. ఈ పరీక్షలను చేయడానికి ప్రత్యేకంగా ఎవరినీ ఎంచుకోలేదని, 80శాతం మంది వారంతట వారే కార్పొరేట్ల నుంచి వచ్చి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ఒక్క థైరోకేర్‌ మాత్రమే కాకుండా ఢిల్లీలోని మరో సంస్థ కూడా ఇలాంటి సర్వేనే తెలియజేసింది. ఈ సర్వేలో ప్రపంచంలో 23శాతం మంది యాంటీబాడీస్‌ను కలిగి ఉన్నట్లు తెలియజేసింది

మరోవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో సక్సెస్ అయినా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ సక్సెస్ కావాల్సి ఉంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.