ఇతడి జీతం రూ.15,000 మాత్రమే.. 24 ఇళ్లు, 6 ప్లాట్లు, 40 ఎకరాల భూమి, కిలో గోల్డ్‌ ఉన్నాయి.. రూ.30 కోట్ల ఆస్తుల గుర్తింపు

కేఆర్‌ఐడీఎల్‌లో రూ.72 కోట్లు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈ దాడులు మొదలయ్యాయి.

ఇతడి జీతం రూ.15,000 మాత్రమే.. 24 ఇళ్లు, 6 ప్లాట్లు, 40 ఎకరాల భూమి, కిలో గోల్డ్‌ ఉన్నాయి.. రూ.30 కోట్ల ఆస్తుల గుర్తింపు

Updated On : August 1, 2025 / 10:00 PM IST

కర్ణాటక రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌ (కేఆర్‌ఐడీఎల్‌)లో 20 సంవత్సరాలకు పైగా క్లర్క్‌గా పని చేసిన ఓ వ్యక్తి ఆదాయానికి మించి భారీ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. కప్పల్‌లో ఔట్‌సోర్సింగ్ క్లర్క్‌గా పని చేసిన కలకప్ప నివదగుండిపై దర్యాప్తు జరుగుతోంది. అతడి నెల జీతం రూ.15,000 అయినప్పటికీ దాదాపు రూ.30 కోట్ల విలువైన ఆస్తులు కూడగట్టాడు.

అతడికి ప్రగతి నగర్‌ ఉన్న నివాసంలో లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేఆర్‌ఐడీఎల్‌లో రూ.72 కోట్లు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈ దాడులు మొదలయ్యాయి.

దాడిలో బయటపడిన భారీ ఆస్తులు
ఈ ఆపరేషన్‌లో అధికారులు 24 ఇళ్లు, 6 ప్లాట్లు, 40 ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి, కిలోకు పైగా బంగారు ఆభరణాలు, అనేక వాహనాలను గుర్తించారు. పత్రాల్లో ఇంకొన్ని అక్రమ ఆస్తుల వివరాలు కూడా ఉన్నట్టు సమాచారం. ఆస్తులలో కొన్ని నివదగుండి భార్య, సోదరుల పేర్లపై ఉన్నట్టు కనుగొన్నారు. ఈ దాడి ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. పలువురు చేసిన ఫిర్యాదుల మేరకు ఈ దర్యాప్తు ప్రారంభమైంది.

Also Read: మెస్సీ vs ధోనీ, కోహ్లీ: ముంబైలో డ్రీమ్ మ్యాచ్? సచిన్, రోహిత్ శర్మ వంటి ఇతర దిగ్గజ క్రికెటర్లు కూడా..

నకిలీ ప్రాజెక్టులు, తప్పుడు పత్రాలు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు 2019 నుంచి 2025 మధ్య 96 నకిలీ ప్రాజెక్టులకు తప్పుడు ఇన్వాయిస్‌లు, డాక్యుమెంట్లు సృష్టించారు. వీటిలో కాలువలు, రహదారులు, తాగునీటి పనులు ఉన్నాయి. కనకగిరిలో 19, గంగావతిలో 5, యెలబుర్గాలో 4, కప్పల్ తాలూకాలో 68 ప్రాజెక్టులుగా మొత్తం రూ.72 కోట్లు ప్రభుత్వ నిధులు మళ్లించినట్టు తెలుస్తోంది.

దాడికి కొన్ని నెలల ముందు నివదగుండిని ఉద్యోగం నుంచి తొలగించారు. చించోలికార్లను తొలగించినా, కోర్టు ఆదేశాలతో ఇంకా సర్వీసులో ఉన్నాడు. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.