తల్లి కళ్లముందే ఘోరం : పాలు తాగుతున్న పసివాడిని నోటకురుచుకుపోయిన చిరుత

మక్కుపచ్చలారని పసిబిడ్డను నోటకరుచుకుపోయింది ఓ చిరుత. ఇంట్లో పాలు తాగుతున్న మూడేళ్ల పసిబాలుడిని నోటకరుచుకుపోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరాంచల్‌లోని పిథౌర్‌గఢ్ జిల్లా బెరీనాగ్ తహసీల్ పరిధిలో చోటుచేసుకుంది.
బెరీనాగ్ పరిధిలోని మలెతా గ్రామంలో నివసిస్తున్న హేమాదేవికి మూడేళ్ల కుమారుడున్నాడు. పేరు నైతిక్ కార్క్. ఆకలిగా ఉన్న బాబుకు గ్లాసుతో పాలు పట్టిస్తోంది. హేమావతి. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఓ చిరుత పులి ఇంట్లోకి వచ్చింది. రావటం రావటం నైతిక్ పై దాడి చేసింది..నోట కరుచుకుని పట్టుకుపోయింది. దీంతో తల్లి పెద్దగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారంతా వచ్చారు. పిల్లాడిని నోటితో పట్టుకుపోతున్న చిరుతను చూశారు.చేతికి అందిన కత్తీ, కర్రా పట్టుకుని పెద్దగా అరుస్తూ..పులిని వెంబడించారు. అలా కొంత దూరం వెళ్లిన ఆ చిరుత గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అరుస్తూ వస్తూండటంతో బెదిరింది. బాలుడిని రోడ్డుపై వదిలేసి పరుగెత్తిపోయింది.
ఆ పసివాడి మెడ, చేతులు తీవ్రంగా గాయపడటంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం కావటంతో ఆ బాలుడు మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. బాలుడి మరణంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులంతా అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కార్క్ తండ్రి రమేష్ ఢిల్లీలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంటాడు. గ్రామంలో అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, మూడేళ్ల కుమారుడు నైతిక్ కార్క్ ఉంటున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల వయస్సున్న నైతిక్ చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
తన కళ్లముందే బిడ్డను ఓ క్రూర మృగం దాడిలో చనిపోవటంతో కడుపుడు శోకంతో ఆ తల్లి శోకిస్తోంది. గ్రామస్థుల ఆందోళనతో గ్రామంలో అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.