UP Man Bank Account: వామ్మో.. యూపీ వ్యక్తి బ్యాంక్ ఖాతాలో భారీగా డబ్బు.. ఎలాన్ మస్క్ కన్నా నేనే రిచ్ అని తెగ మురిసిపోయాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..
అతడి అకౌంట్ లో 1,00,13,56,00,00,01,39,54,21,00,23,56,00,00,01,39,542 ఉన్నట్లుగా చూపించింది.

UP Man Bank Account: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అజిత్ అనే వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో ఒక దిగ్భ్రాంతికరమైన మొత్తాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతడి అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో తెలిసి.. అతడికి దిమ్మతిరిగిపోయింది. అందులో 36 అంకెల డబ్బు ఉంది. అంటే.. అనేక దేశాల GDP కన్నా ఎక్కువ మొత్తం అన్న మాట. అంతే.. అతడు ఫుల్ ఖుషీ అయిపోయాడు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కన్నా నేనే రిచ్ అని తెగ మురిసిపోయాడు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కాసేపటికే దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ వెలుగుచూసింది.
తన బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు ఉండటంతో.. సైబర్ నేరగాళ్ల కన్ను పడొచ్చని భయపడ్డ అజిత్.. వెంటనే బ్యాంకు వాళ్లను సంప్రదించాడు. వారికి విషయం చెప్పాడు. అంతే.. కాసేపటికే అతడి ఆనందం ఆవిరైంది. దిమ్మతిరిగిపోయే విషయం బయటపడింది. వాస్తవానికి అతడి బ్యాంకు అకౌంట్ లో అంత డబ్బు లేనే లేదు. ఏదో సాంకేతిక లోపం కారణంగా అతడి అకౌంట్ లో అలా కనిపించిందని బ్యాంకు అధికారులు వివరించారు.
జమ్ముకశ్మీర్ బ్రాంచ్ చేసిన తప్పిదం కారణంగా అతడి బ్యాంకు ఖాతాలో అంత మొత్తం చూపించిందని, నిజానికి అతడి బ్యాంకు అకౌంట్ లో అంత డబ్బు లేదని చావు కబురు చల్లగా చెప్పారు అధికారులు. ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందని, అతని ఖాతాకు అసలు క్రెడిట్ జరగలేదని వెల్లడించారు. దీంతో అజిత్ దిమ్మతిరిగిపోయింది.
Also Read: ప్రాణం తీసిన పని ఒత్తిడి..! ఓలా ఏఐ ఆర్మ్ ఇంజినీర్ బలవన్మరణం.. టీమ్ మేనేజర్‌పై వేధింపుల ఆరోపణలు..
ఏప్రిల్ 24న ఈ ఘటన జరిగింది. అజిత్ తన ఖాతా నుండి రూ.1,800 ఒకసారి, రూ.1,400 మరొకసారి డ్రా చేశాడు. తర్వాతి రోజు తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగా.. అతడికి షాక్ కొట్టినంత పనైంది. అతడి అకౌంట్ లో 1,00,13,56,00,00,01,39,54,21,00,23,56,00,00,01,39,542 ఉన్నట్లుగా చూపించింది.
అతని ఖాతాలో 36 అంకెలు ఉన్నాయి. ఈ సంఖ్య ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర విలువ కంటే వేల రెట్లు ఎక్కువ. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద రూ.36 లక్షల కోట్లకు పైనే. బ్యాంకు వాళ్లని సంప్రదించగా అజిత్ కు అసలు విషయం అర్థమైంది. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందని తెలుసుకుని తెగ ఫీలయ్యాడు. టెక్నికల్ ఎర్రల్ వల్ల ఇలా జరిగిందని బ్యాంకు అధికారులు చెప్పినా.. అజిత్ అకౌంట్ లో మాత్రం 36 అంకెలు కనిపిస్తూనే ఉన్నాయి.
దీంతో అతడు లోకల్ పోలీసులను ఆశ్రయించాడు. వారు.. సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. పోలీసులు చెప్పినట్లే అజిత్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ముందు జాగ్రత్తగా అజిత్ బ్యాంక్ అకౌంట్ ను సీజ్ చేశారు. అసలేం జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు.