కోటా హాస్పిటల్ లో మరోసారి శిశుమరణాల కలకలం

9 newborns die in Kota hospital రాజస్తాన్ రాష్ట్రంలోని కోటా సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ లో మరోసారి పిల్లల మరణాలు కలకలం సృష్టించాయి. జేకే లొన్ హాస్పిటల్ లో కొన్ని గంటల వ్యవధిలోనే తొమ్మిది మంది పసికందులు మృతి చెందినట్లు గురువారం అధికారులు తెలిపారు. కాగా, గతేడాది కూడా పెద్ద సంఖ్యలో కోట హాస్పిటల్ లో పసి బిడ్డలు మరణించడం కలకం రేపిన విషయం తెలిసిందే.
2019లో కోటా హాస్పిటల్ లో 100మందికి పిల్లల మరణవార్త అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏడాది తర్వాత ఇప్పుడు కోట హాస్పిటల్ లో మరోసారి పెద్ద సంఖ్యలో శిశువుల మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం(డిసెంబర్-10,2020) అధికారులు తెలిపిన ప్రకారం మొత్తం 9మంది శిశువులు చనిపోగా..బుధవారం రాత్రి ఐదుగురు శిశువులు,గురువారం మరో నలుగురు చనిపోయారు.
చనిపోయినవాళ్లందరు 1-4ఏళ్లలోపు వయస్సు కలిగినవారేనని అధికారులు తెలిపారు. ముగ్గురు సాధారణంగా మరణించగా.. మరో ముగ్గురు పుట్టుకతోనే వచ్చే వ్యాధుల వల్ల మృతి చెందారని.. మరో ముగ్గురు రిఫర్డ్ కేసులని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, వైద్యుల నిర్లక్ష్యమే పిల్లల మరణానికి కారణమని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
కాగా, ఈ ఘటనపై స్పందించిన రాజస్తాన్ ఆరోగ్య మంత్రి రఘుశర్మ తక్షణమే విచారణకు ఆదేశించారు. ఆసుపత్రి వర్గాల నుంచి నివేదిక కోరారు. ఈ అంశాన్ని రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల శిశు మరణాల జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు శర్మ పేర్కొన్నారు. నవజాత శిశువుల చికిత్స పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్ ను ఆయన ఆదేశించారు.
మరోవైపు, ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఒక కమిటీని కోటా జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. గురువారం ఆ కమిటీ దవాఖానకు వెళ్లి నవజాత శిశువుల మరణాలపై ఆరా తీసింది. అక్కడి వైద్య సదుపాయాలను పరిశీలించింది.