Gold In Stomach: బంగారం మింగిన దొంగ.. కానీ కథ అడ్డం తిరిగింది..!

దొంగలు తాము దోచుకున్న సొత్తు పోలీసుల కంటపడకుండా ఎదో ఓ చోట దాచుకుంటారు. అయితే ఓ దొంగమాత్రం ఏకంగా పొట్టలో దాచుకున్నాడు. కానీ అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో బంగారం పోలీసుల చేతిలోకి వెళ్ళింది.

Gold In Stomach: బంగారం మింగిన దొంగ.. కానీ కథ అడ్డం తిరిగింది..!

Gold In Stomach

Updated On : June 1, 2021 / 3:45 PM IST

Gold In Stomach: దొంగలు తాము దోచుకున్న సొత్తు పోలీసుల కంటపడకుండా ఎదో ఓ చోట దాచుకుంటారు. అయితే ఓ దొంగమాత్రం ఏకంగా పొట్టలో దాచుకున్నాడు. కానీ అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో బంగారం పోలీసుల చేతిలోకి వెళ్ళింది. ఘటన వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన శిబు అనే వ్యక్తి కర్ణాటకలోని దక్షణ కన్నడ జిల్లాలో ఉంటున్నాడు. శిబు దొంగతనమే జీవనాధారంగా చేసుకున్నాడు. అనేక ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు.

అయితే తాజాగా ఓ ఇంట్లో 35 గ్రాముల బంగారం దొంగిలించాడు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పాత దొంగ శిబునే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు అతడికోసం గాలింపు చేపట్టారు. పోలీసులను ముందే పసిగట్టిన శిబు తాను దొంగిలించిన బంగారం చిక్కకూడదని భావించి మొత్తం మింగేశాడు. బంగారం మింగిన కొద్దిసేపటికే పోలీసులు అతడిని పట్టుకున్నారు.

ఇదే సమయంలో శిబుకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు ఎక్స్‌రే తీయడంతో కడుపులో బంగారం ఉన్నట్లు బయటపడింది. దీంతో ఆ బంగారాన్ని డాక్టర్లు బయటకు తీసి పోలీసులకు అప్పగించారు. బంగారం గురించి పోలీసులకు తెలియకుండా ఉండేందుకు తాను ఐస్‌క్రీంతో కలిపి 35 గ్రాముల ఉంగరాలను మింగేశానని నిందితుడు తెలిపాడు.