ఆధార్‌లో బంధుత్వాలుండవ్: సన్నాఫ్ స్థానంలో కేరాఫ్

aadhar card otp
ఆధార్ కార్డ్‌లో సనాఫ్ అనో, డాటర్ ఆఫ్ అనో, లేకుంటే వైఫ్ ఆఫ్ తండ్రి పేరో లేకుంటే భర్త పేరో ఉంటుంది కదా? ఇక మీదట అటువంటి బంధుత్వాలు ఆధార్ కార్డ్‌లో కనిపించవు. ఆ రిలేషన్ స్థానంలో కేరాఫ్ అని రాబోతుంది. అవును ఇప్పటివరకు ఆధార్ సంస్థ రిలేషన్‌లను ఎంట్రీ చేస్తూ ఉండగా.. దానిని మార్పు చేస్తూ సాఫ్ట్ వేర్‌లో కొత్త అప్‌డేట్ తీసుకుని వచ్చింది. దీని ప్రకారం కొత్త ఆధార్ కార్డ్ తీసుకోవాలని అనుకున్నా.. లేకుంటే.. ఆధార్ కార్డ్‌లో అప్ డేట్ చెయ్యాలి అనుకున్నా.. కేరాఫ్ అని మారిపోతుంది.
ఆధార్ కార్డులో బంధుత్వాలకు స్థానం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మా తండ్రో, భర్తో భారతీయుడు కాబట్టి నేను కూడా ఇండియన్‌నే అనడానికి భవిష్యత్తులో అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు. ఎన్నార్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరికి వారే తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క ఆధార్‌లో మాత్రమే కాదు.. పాస్‌పోర్టులోనూ ఇదే మార్పు రానుంది. నిజానికి, పౌరసత్వం పొందాలంటే మన దేశంతోపాటు విదేశాల్లోనూ ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌లను ప్రామాణికంగా భావిస్తారు. ఈ రెండు డాక్యుమెంట్ల ఆధారంగానే భారత పౌరుడు అని సర్టిఫై చేస్తారు.
లేటెస్ట్‌గా తీసుకున్న నిర్ణయంతో గతంలో మాదిరిగా అన్ని ధ్రువీకరణ పత్రాలూ సమర్పించినా కూడా కొత్తగా జారీ అయ్యే కార్డులో బంధుత్వం వివరాలు మాత్రం ప్రచురించరు. ఇప్పటివరకు ఉన్న సన్నాఫ్, డాటరాఫ్ స్థానంలో కేరాఫ్ అని వస్తుంది. కొత్త కార్డుదారులకు మాత్రమే కాదు.. మార్పులు చేర్పులు చేసుకున్నవారి పరిస్థితి కూడా ఇదే. అయితే ఇప్పటివరకు ఆధార్‌లో బంధుత్వాల తొలగింపు కానీ కేరాఫ్ కొత్తగా చేర్చడానికి సంబంధించి కేంద్రం లేదా ఆధార్ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేవు.
సాధారణంగా నిర్దిష్టమైన చిరునామా లేని సందర్భాల్లో, మరొకరి చిరునామా వినియోగిస్తున్నప్పుడు, ఇతరుల పేరిట చిరునామా ఇచ్చినప్పుడు మాత్రమే ‘కేరాఫ్’ పదాన్ని వినియోగిస్తారు. అయితే మనదేశంలో బంధుత్వాలకు, సంక్షేమ పథకాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలతో కొంత ఇబ్బంది అయితే తప్పదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.