Punjab Minister: పంజాబ్‌లో ఆప్ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది.. వారికి రూ.25కోట్లు ఆఫర్ చేశారు..
ఢిల్లీలో జరిగిన కుట్రమాదిరిగా.. ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నిందని, దీనికి బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ అని పేరు పెట్టిందని పంజాబ్ మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు.

Punjab Finance Minister Harpal Singh Cheema
Punjab Minister Harpal Singh: ఢిల్లీలో జరిగిన కుట్రమాదిరిగా.. ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నిందని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించింది. దీనికి బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ అని పేరు పెట్టిందని పంజాబ్ మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు. రాష్ట్రంలో భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ మా 10 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 20 నుంచి రూ.25కోట్లు ఆఫర్ చేసిందని హర్పాల్ ఆరోపించారు.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు రూ. 5కోట్లు ఆఫర్ చేసి ఆకర్షిస్తోందని ఇటీవల ఆప్ నేతలు ఆరోపణలు చేసిన విషయం విధితమే. తాజాగా పంజాబ్ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రి మాట్లాడుతూ.. పంజాబ్ లోని మా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. ఆప్ నుండి వారిని విడగొట్టేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కొందరు నేతలను పంపించింది.. వారు మా ఎమ్మెల్యేలను టెలిఫోన్ లో సంప్రదిస్తూ ప్రలోబపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మంత్రి ఆరోపించారు. ఇక్కడి బీజేపీ నేతలు మా ఎమ్మెల్యేలను సంప్రదించి ఢిల్లీలోని పెద్ద నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, వారికి రూ. 25కోట్లు ఇస్తామని చెప్పారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బీజేపీ నుంచి ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించిన వారిలో పంజాబ్ కు చెందిన కొందరు, ఢిల్లీకి చెందిన మరికొందరు బీజేపీ నేతలు ఉన్నట్లు మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు.
ఇదిలాఉంటే.. అల్లర్లు, పోలీసు సిబ్బందిపై దాడి కేసులో స్థానిక కోర్టు దోషులుగా నిర్ధారించిన ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలను పార్టీ నుండి తొలగించాలని బీజేపీ ఢిల్లీలో మంగళవారం అరవింద్ కేజ్రీవాల్‌ను డిమాండ్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు పోకిరీలు, అల్లరి మూకలు, అవినీతిపరుల పార్టీగా మారిందని, ఆ పార్టీ అసలు రూపాన్ని ఈ నేరారోపణలు బట్టబయలు చేస్తున్నాయని బీజేపీ ఢిల్లీ విభాగం చీఫ్ ఆదేశ్ గుప్తా విలేకరుల సమావేశంలో అన్నారు.