తప్పు చేశాను సారీ..మాస్క్ పెట్టుకుంటానంటూ మంత్రి పశ్చాత్తాపం

  • Published By: nagamani ,Published On : September 24, 2020 / 03:26 PM IST
తప్పు చేశాను సారీ..మాస్క్ పెట్టుకుంటానంటూ మంత్రి పశ్చాత్తాపం

Updated On : September 24, 2020 / 3:43 PM IST

wear mask: మాస్క్ పెట్టుకోవడం ఇప్పుడు తప్పనిసరి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు విధంగా వీటిని ధరించాల్సిందే. ఇతరులను కలిసినప్పుడు, జన సంచారం ఉన్న ప్రాంతంలో తప్పనిసరిగా పాటించాల్సిందే. కానీ కొంత మంది ప్రజా ప్రతినిధులు మాత్రం మాకేం కాదులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారు. ఇలాగే ఓ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


నేను మాస్క్ పెట్టుకోను..నంటూ తెగేసి చెప్పిన మంత్రి వెనక్కి తగ్గారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ మాస్క్ పెట్టుకోనని అనటంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో సదరు మంత్రిగారు వెనక్కి తగ్గారు. నేను తప్పుగా మాట్లాడాను..నన్ను క్షమించండి అంటూ క్షమించమని మధ్యప్రదేశ్‌ మంత్రి నరోత్తం మిశ్రా కోరారు. ఇక నుంచి విధిగా మాస్క్ పెట్టుకుంటానని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఇది జరిగింది.


కాగా కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్రా మాస్క్ ధరించే విషయంలో వితండ వాదం చేశారు. తాను మాస్క్ పెట్టుకోనంటూ తెగేసి చెప్పారు. దీంతో విపక్ష కాంగ్రెస్ నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. కేంద్రం నిర్ణయాలను ఆ పార్టీకి చెందిన వ్యక్తి పాటించడం లేదని ఆక్షేపించారు. ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం..ఇదేనా కరోనా నిబంధనలు పాటింంచే విధానం అంటూ విమర్శలు వర్షం కురిపించేసరికి మంత్రిగారు దిగొచ్చారు.


తాను తప్పు చేశానని అంగీకరిస్తూ..‘మాస్కు ధరించకూడదనే నా ప్రకటన చట్ట ఉల్లంఘనగా కనిపిస్తుంది. ఇది ప్రధానమంత్రి మనోభావాలకు అనుగుణంగా లేదు. నా తప్పును నేను అంగీకరిస్తున్నాను’ ప్రతీ ఒక్కరు తప్పకుండా మాస్క్ ధరించాలని సూచిస్తూ గురువారం ఉదయం ట్వీట్ వేదికగా మాట్లాడారు. కాగా ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాస్క్ ధరించకపోతే రూ. 200 జరిమాన విధిస్తోంది.