Adil Hussain: పహల్గాం ఉగ్రదాడి కేసులో ప్రధాన అనుమానితుల్లో ఒకడు అదిల్ హుస్సేన్. అతడి కోసం ముమ్మరంగా గాలింపు జరుగుతోంది. ఈ క్రమంలో అదిల్ తల్లి స్పందించారు. లొంగిపోవాలని తన కొడుకు అదిల్ హుస్సేన్ ను అతడి తల్లి షాజాదా బానో కోరారు. నువ్వు లొంగిపో.. కనీసం మేమన్నా ప్రశాంతంగా బతుకుతాం అని ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు. మేమంతా ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాము, వెంటనే నువ్వు లొంగిపో అని కొడుకుని అభ్యర్థించారామె.
కాగా, అదిల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అంటే తాను నమ్మనని షాజాదా బానో అన్నారు. ఒకవేళ తన కొడుకే ఈ దాడి చేసి ఉంటే మాత్రం చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకోవాలన్నారు. 2018 నుంచి తన కొడుకు జాడ తెలియదని ఆమె చెప్పారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన అదిల్ ఇప్పటివరకూ తిరిగి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో అదిల్ హుస్సేన్ థోకర్‌ను అనుమానితుడిగా పేర్కొన్న తర్వాత షాజాదా బానో ఇల్లు కూల్చివేయబడింది. 2018లో అదిల్ పరీక్ష రాసేందుకు వెళ్లాడని, తిరిగి ఇంటికి రాలేదని, అప్పటి నుండి అతడితో తమకు ఎలాంటి సంబంధాలు లేవని అదిల్ కుటుంబం చెబుతోంది. లొంగిపోవాలని తన కొడుకును తల్లి బానో వేడుకున్నారు. అదిల్ తల్లి ఇంటి కూల్చివేతకు ముందు భద్రతా దళాలు సోదా చేశాయి. అదిల్ తండ్రి, సోదరులు, బంధువులను అదుపులోకి తీసుకున్నాయి. కాగా, అదిల్ చాలా మంచి విద్యార్థి అని, బాగా చదువుకునే వాడని ఇరుగుపొరుగు వారు గుర్తు చేసుకున్నారు.
జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బెహారా సమీపంలోని గురీ గ్రామంలో అదిల్ కుటుంబం నివాసం ఉంటోంది. ఉగ్రదాడిలో అదిల్ ప్రమేయం ఉందని తెలియగానే భద్రతా బలగాలు.. అతడి ఇంటిని కూల్చేశాయి. ఆ సమయంలో అదిల్ తల్లి బానో, కుటుంబసభ్యులను పొరుగు గ్రామంలోని బంధువుల తమ ఇంటికి తీసుకెళ్లారు.
Also Read: పహల్గాం దుశ్చర్య మొత్తం వీడియో రికార్డ్.. చెట్టెక్కి రికార్డ్ చేసిన రీల్స్ వీడియోగ్రాఫర్..
అదిల్ మంచి విద్యార్థిగా గుర్తింపు పొందాడు. అలాంటి వాడు ఇలా తయ్యారయ్యాడంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. ఈ కేసులో ప్రధాన అనుమానితులలో అదిల్ ఒకడు. అతని ఆచూకీ చాలా సంవత్సరాలుగా తెలియడం లేదు.
”2018 ఏప్రిల్ 29న పరీక్ష రాసేందుకు బద్గాం వెళ్తున్నట్లు అదిల్ వెళ్లాడు. అంతే, ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అదిల్ కనిపించకుండా పోయిన మూడు రోజులకు తాము పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చామని” అదిల్ తల్లి బానో తెలిపారు.
Also Read: బాధితుల ప్యాంట్లు విప్పించి చెక్ చేసిన ఉగ్రవాదులు.. ఎందుకంటే?
గురువారం భద్రతా దళాలు వచ్చి మా ఇంటిని సోదా చేశాయి. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చారు. మీ కొడుకు ఇంటికి వచ్చి భోజనం చేశాడు కదా అని వారు అడిగారు. ఆ విషయం మీకు తెలిస్తే, మీరు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని నేను అడిగాను. నా కొడుకు చాలా సంవత్సరాలుగా ఇంట్లో లేడని నేను వారికి చెప్పాను” అని బానో తెలిపారు. ఆ వెంటనే.. త్వరలో బాంబు పేలబోతోంది, త్వరగా పారిపోండి అని భద్రతా దళాలు తనతో చెప్పినట్లు బానో వెల్లడించారు.
2018లో తీవ్రవాదులతో కలిసిపోయిన తర్వాత ఆదిల్ పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. స్టడీ వీసాపై అతను పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడని నిఘా సంస్థలు కూడా నిర్ధారించాయి. 2024లో అతను ఎల్‌ఓసీ దాటి భారత దేశంలోకి తిరిగి ప్రవేశించాడని అధికారులు అనుమానిస్తున్నారు.
”నా ఇల్లు కూల్చేశారు. నా భర్త, కుమారులు కస్టడీలో ఉన్నారు. పొరుగు వారు ఎంతకాలం నాకు ఆహారం పెడతారు?” అంటూ తన కొడుకు అదిల్ ఫోటోను పట్టుకుని బానో కన్నీటిపర్యంతం అయ్యారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here