షాకింగ్ న్యూస్ : 10 రోజుల్లో మరో మూడు తుఫాన్లు

After Cyclone Nivar : నివార్ తుపాన్ ప్రభావం నుంచి కోలుకోకముందే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ వెల్లడించింది. రానున్న 10 రోజుల్లో బంగాళాఖాతంలో మరో 3 తుపాన్లు వచ్చే అవకాశం ఉందంటూ బాంబు పేల్చింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండం కాస్తా తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే డిసెంబర్ నెలలో మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.
డిసెంబర్ 2వ తేదీన బురేవి తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై దీని ప్రభావం ఎక్కువ ఉండనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో టకేటి తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 7న దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రానున్న 10 రోజుల్లో మరో మూడు తుపాన్లు రానుండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అక్కడే మరికొన్ని రోజులు షెల్టర్ ఇవ్వాలని భావిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.