Phule First School: ఫూలే దంపతులు మొదటి బాలికల పాఠశాలకు అనూహ్య గౌరవం.. కోర్టు తీర్పుతో వెంటనే కదిలిన ప్రభుత్వం
కోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు వెంటనే ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు.

Bhide Wada Girls School: దేశంలోనే బాలికల కోసం మొదటి పాఠశాల జాతీయ స్మారక చిహ్నంగా మారబోతోంది. సామాజిక సంస్కర్తలు ఫూలే దంపుతులు మహారాష్ట్రలోని పూణెలో ఉన్న భిడే వాడలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాల వివాదం గత 13 సంవత్సరాలుగా సాగుతోంది. అయితే బాంబే హైకోర్టు దీని మీద బుధవారం తుది తీర్పు వెలువరించింది. దీంతో ఈ పాఠశాలను జాతీయ స్మారక చిహ్నంగా నిర్మించేందుకు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
ప్రధానాంశాలు:
*సంఘ సంస్కర్తలు జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే 1848లో ఎనిమిది మంది విద్యార్థినులతో భిడే వాడాలో ఈ పాఠశాలను ప్రారంభించారు.
*మూడేళ్ల నాటికి అంటే 1851 నాటికి 150 కంటే ఎక్కువ మంది విద్యార్థినులతో మూడు పాఠశాలలను నడిపారు.
కోర్టు తీర్పు:
పూణే మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ లీగల్ ఆఫీసర్ నిషా చవాన్ మాట్లాడుతూ.. అద్దెదారులు, దుకాణదారుల పిటిషన్‌ను బాంబే హైకోర్టు సోమవారం తిరస్కరించిందని పేర్కొన్నారు. అలాగే గొప్ప వ్యక్తుల పేరిట స్మారక చిహ్నాలు నిర్మించే హక్కు, రోడ్లు, వంతెనలు నిర్మించే పూర్తి హక్కు ప్రభుత్వానికి ఉందని జస్టిస్ గౌతమ్ పటేల్, జస్టిస్ కమల్ ఖతా స్పష్టం చేశారు.
ముందస్తు ప్రణాళిక:
రాష్ట్ర ఆహార-పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ ఈ ఉత్తర్వును స్వాగతించారు. ఒక గొప్ప స్మారక చిహ్నం నిర్మిస్తామని కోర్టు తీర్పు అనంతరం విలేకరులతో అన్నారు. అక్కడ ఎలాంటి పాఠశాల లేదని అద్దెదారు వాదించారని, అవన్నీ అబ్ధాలని తేలిపోయానని అయన అన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు.
భిడే వాడా పునర్నిర్మాణంతో ఆ చారిత్రక ప్రదేశ ప్రాముఖ్యత ముందుకు తరాలకు మరింత చేరువ అవుతుందని సమాజికవేత్తలు, అంబేద్కరైట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది భారతీయ సమాజం పట్ల నిబద్ధతకు ప్రతీకని పొగడ్తలు కురిపిస్తున్నారు.