Agra Woman Kills Husband : భర్తను హత్య చేసి బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య.. 45రోజుల తర్వాత వెలుగులోకి.. ఎలా కనిపెట్టారంటే?
Agra Woman Kills Husband : ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను హత్య చేసి, ఇంటి బాత్రూమ్ నేల కింద పాతిపెట్టింది.
Agra Woman Kills Husband
Agra Woman Kills Husband : ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను హత్య చేసి, ఇంటి బాత్రూమ్ నేల కింద పాతిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు, హత్యకు మరెవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read : Khamenei funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ.. వాళ్లకు ఐఆర్జీసీ వార్నింగ్.. మా జోలికి రావొద్దు..
మృతుడిని సురేంద్ర శర్మగా గుర్తించారు. ఆయన 45రోజుల క్రితం కనిపించకుండా పోవడంతో అతని భార్య రూబీ, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి సురేంద్ర శర్మకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో సురేంద్ర భార్య రూబీ కూడా తన భర్త కోసం వెతుకుతున్నట్లు నటిస్తూ పోలీసులకు సహకరిస్తున్నట్లు కనిపించింది. అంతేకాదు.. భర్త కనిపించడం లేదంటూ పొరుగువారి ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.
అయితే, సురేంద్ర అదృశ్యమైన ఘటనపై రూబీ చెబుతున్న వివరాలతో కుటుంబ సభ్యుల్లో అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ తరువాత సురేంద్ర సోదరుడు రూబీ ప్రవర్తనపై పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు రూబీని పలు విధాలుగా ప్రశ్నించారు. రూబీ చెప్పిన వివరాలతో పోలీసులకుసైతం ఆమెపై అనుమానం కలిగింది. దీంతో ఇంట్లో సోదాలు నిర్వహించగా బాత్ రూమ్ నేలపై కొత్తగా ప్లాస్టర్ చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో బాత్ రూమ్ నేలను తొలగించగా.. సురేంద్ర మృతదేహం బయటపడింది.
సురేంద్ర శర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తరువాత రూబీని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. తానే హత్యచేసినట్లు ఒప్పుకొంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేంద్ర శర్మను హత్య చేయడంలో రూబీకి ఎవరైనా సహాయం చేశారా..? మృతదేహాన్ని బాత్ రూమ్లో పాతిపెట్టేందుకు ఇతరుల సహాయం తీసుకుందా..? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
