ఎయిర్ హోస్టస్‌ది ఆత్మహత్యేనా!!

ఎయిర్ హోస్టస్‌ది ఆత్మహత్యేనా!!

Updated On : December 19, 2019 / 4:49 AM IST

ప్రైవేట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎయిర్ హోస్టస్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం గురుగావ్‌లోని డీఎల్ఎఫ్ ఫేజ్ 3లో ఈ ఘటన జరిగింది. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురికి చెందిన మిస్తూ సర్కార్ అనే యువతి ప్రైవేట్ ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తుంది. కొద్ది రోజులుగా తాను ఉంటున్న పీజీ యజమాని నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తండ్రితో తెలిపేది.

‘నా కూతురు అర్ధరాత్రి 2గంటలకు ఫోన్ చేసింది. పీజీ యజమాని తనను వేధిస్తున్నాడంటూ ఫోన్‌లో మాట్లాడింది. ఆ రోజు రాత్రి కూడా తనను అవమానించడంతో తన గదికి వెళ్లిపోయానంది. పీజీ యజమాని తన ఫోన్‌ను హ్యాక్ చేశాడని బయటకు వెళ్లనివ్వకుండా నిర్భందించినట్లు వాపోయింది’ అని మిస్తూ తండ్రి తెలిపాడు. 

కాసేపటి తర్వాత పీజీ ఓనర్ దగ్గర్నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మిస్తూ ఏదో చేసుకుంటుంది. గదిలో నుంచి చప్పుళ్లు వినపడుతున్నాయి. పిలిచినా పలకడం లేదని కాల్ కట్ చేశాడు. మళ్లీ ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో మిస్తూ తండ్రి గురుగ్రామ్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి చేరేసరికి మహిళ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్నట్లు గుర్తించారు. 

నాకు పీజీ ఓనరే ఏదో చేసుంటాడనే అనుమానంగా ఉంది. నా కూతురు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఫోన్ సంభాషణలో ఇటువంటి పని చేసే విధంగా కనిపించలేదని మృతురాలి తండ్రి చెప్పారు. ఘటనాస్థలంలో.. పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లుగా ఉంది. ఫోరెన్సిక్ టీం వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేస్ ఫైల్ చేశారు. నిందితుడిపై విచారణ జరుగుతుంది.