ఏకే 203.. ప్రపంచ శ్రేణి ఆయుధాల్లో అత్యాధునికం

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 01:15 PM IST
ఏకే 203.. ప్రపంచ శ్రేణి ఆయుధాల్లో అత్యాధునికం

ఏకే 203.. ప్రపంచ శ్రేణి ఆయుధాల్లో అత్యాధునిమైంది. అమెరికా అమ్ములపొదిలోని ఆయుధాలకన్నా శక్తివంతమైనది. శత్రువును చీల్చి చెండాడే ఆయుధమిది. ఇండియన్‌ ఆర్మీకి ఇవి అందిన వెంటనే ప్రపంచంలోని బలవంతమైన సైన్యాల్లో మనదీ చేరిపోతుంది. ఇకపై భారత సైనికుల ముందు కుప్పిగంతులు వేయడం అంత ఈజీ కాదు. 

ఇన్సాస్‌.. ఇండియన్‌ స్మాల్‌ ఆర్మ్స్‌ సిస్టమ్‌.. భారత దేశంలోనే తయారై  ఇప్పటివరకు ఇండియన్‌ ఆర్మీ వాడుతున్న ఆయుధం. AK-47 నకలుగా తయారైన ఈ తుపాకీ.. అధిక బరువు, పొడవుతో సైనికులకు ఇబ్బంది కలిగిస్తోంది. శత్రువుతో పోరాడేప్పుడు అవస్థలకు గురిచేస్తోంది. దశాబ్ధాల కాలంగా ఇదే స్టాండర్డ్‌ ఆయుధం. సాంకేతికత పెరిగింది.. టెక్నాలజీకి తగినట్టుగా ఆయుధాలు కూడా రూపాంతరం చెందాయి. కానీ మన సైనికుని చేతిలో మాత్రం అదే పాత తరం ఇన్సాసే. దీన్ని భర్తీ చేసేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నమే.. ఏకే 203. 2018లో ఇంట్రడ్యూస్‌ అయిన ఈ రైఫిల్‌ వరల్డ్‌ వైడ్‌ సూపర్‌ రైఫిల్స్‌లో ఒకటి. ప్రస్తుత కాలానికి తగినట్టుగా తయారుచేయబడిన ఆయుధం.

ఏకే 203.. ఏకే 47 నమూనాను పోలి ఉన్నా.. దానికంటే శక్తివంతమైనది.. అత్యాధునికమైనది. ఒక్కసారి ట్రిగ్గర్‌ నొక్కితే నిమిషానికి ఆరు వందల బుల్లెట్స్‌ దూసుకుపోతాయి. నాలుగు వందల మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితత్వంతో చేధిస్తుంది. అలాగే ఇన్సాస్‌తో పోలిస్తే బరువు తక్కువ. ఇన్సాస్‌ రైఫిల్‌ మ్యాగజైన్‌ లేకుండానే నాలుగున్నర కిలోలుంటే.. ఏకే 203 మాత్రం మ్యాగజైన్‌తో కలిపి నాలుగు కిలోల బరువుంటుంది. దీంతో సైనికులకు భారంగా కాకుండా ఉంటుంది. అలాగే దీని వెనక భాగాన్ని మడిచే సౌకర్యం ఉండటంతో.. ఉపయోగించనప్పుడు పట్టుకోవడానికి, శరీరంపై ధరించడానికి సులభంగా ఉంటుంది. అంతేకాదు దీని మెకానిజం కూడా ఇన్సాస్‌తో పోలిస్తే చాలా అద్బుతమైంది. అత్యాధునికమైంది. ఇన్సాస్‌ను వినియోగించిన సైనికులు ఎక్కువగా చెప్పే కంప్లైంట్‌.. రైఫిల్‌ జామ్‌ కావడం.. ఏకే 203 వందశాతం సమర్ధవంతమైనది. ఎన్నిసార్లు వినియోగించినా.. బుల్లెట్స్‌ స్ర్టక్‌ అయ్యే సమస్యే లేదు. ఈ విషయంలో చేసిన ఎన్నో రకాల పరీక్షలను సమర్థవంతంగా దాటిందీ 203. 

ఏకే 203 ఏ విధంగా చూసినా ఇన్సాస్‌ కంటే మెరుగైనది. అంతేకాదు ప్రపంచ శ్రేణి ఆయుధాల్లో మేటి అయినది. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభతరం. అందుకే ఇండియన్‌ డిఫెన్స్‌ దీనివైపు మొగ్గు చూపింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆయుధాలను పరిశీలించి.. ఏకే 203కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీని తయారీ పూర్తయిన వెంటనే ముందుగా కశ్మీర్‌ బలగాలకు ఇది చేరనుంది. అక్కడ ఉగ్రవాదులతో, పాకిస్థాన్‌ ఆర్మీతో యుద్ధం చేస్తున్న సైనికులు ఇకపై ధైర్యంగా పోరాడేందుకు ఇది సహకరించనుంది. ఆర్మీతో పాటు.. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు కూడా వీటిని అందించనుంది. అలాగే రాష్ర్ట పోలీసులకు కూడా వీటిని అందించే ఆలోచనలో ఉంది భారత ప్రభుత్వం. మొత్తంగా కొన్నిరోజుల్లోనే భారత సైనిక బలగాలన్నీ ఏకే 203తో శత్రువును ఏకిపారేయనున్నాయి. మన సైనికులు ఎప్పుడూ ధైర్యవంతులే.. పరాక్రములే. వారికి ఏకే 203 తోడైతే.. ఇక మన సైనిక వ్యవస్థను ఎవరూ ఓడించలేరనేది అంచనా. ధైర్యానికి శక్తి తోడైతే.. అదే ఏకే 203 ఫోర్స్‌ అని ఇండియన్‌ డిఫెన్స్‌ నిరూపించాలనుకుంటోంది. అది నిజంగానే నెరవేరాలని.. నెరవేరుతుందని ఆశిద్దాం. జవానుకు బలంగా మారనున్న ఏకే 203కి సలాం చేద్దాం.