PM Modi: దేశ చరిత్రలో మొట్టమొదటిసారి.. మోదీకి 2,300 మంది మహిళా పోలీసులతో భద్రత.. ఎందుకంటే?
మోదీకి భద్రత కల్పించనున్న మహిళా పోలీసుల్లో ఐపీఎస్ అధికారుల స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు ఉంటారు.

గుజరాత్ పర్యటనలో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పూర్తిగా మహిళా పోలీసులే భద్రత కల్పించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ప్రధాని మోదీ గుజరాత్‌లోని నవ్‌సారీ జిల్లాలో పర్యటిస్తారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ ప్రసంగించబోయే మెగా కార్యక్రమంలో మహిళా పోలీసు సిబ్బందితో కూడిన భద్రతా కవర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మహిళా దినోత్సవం వేళ ఆయనకు మహిళా పోలీసులే భద్రత కల్పించనున్నారు.
ఈ విషయాన్ని గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవీ మీడియాకు చెప్పారు. మోదీకి భద్రత కల్పించనున్న మహిళా పోలీసుల్లో ఐపీఎస్ అధికారుల స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు ఉంటారని అన్నారు.
మొత్తం 2,300 మంది భద్రత కల్పిస్తారని చెప్పారు. 2100 మంది మహిళా కానిస్టేబుళ్లతో పాటు 187 మంది మహిళా ఎస్సైలు, 61 మంది మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, 16 మంది మహిళా డీఎస్పీలు, ఐదుగురు మహిళా ఎస్పీలు, ఒక మహిళా ఐజీ ఉంటారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సీనియర్ మహిళా ఐపిఎస్ ఆఫీసర్, హోం కార్యదర్శి నిపునా తోరావేన్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.
మోదీ ఇవాళ కూడా గుజరాత్‌లో పర్యటించారు. సిల్వాసలో మధ్యాహ్నం 2 గంటలకు- నమో ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సిల్వాసలోనే మధ్యాహ్నం 2.45 గంటలకు- వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవాలు చేశారు. సూరత్‌లో సాయంత్రం 5 గంటలకు – సూరత్ ఫుడ్ సెక్యూరిటీ శాట్యురేషన్ క్యాంపైన్‌ను ప్రారంభించారు.