హ‌ర్యానా సీఎంపై పంజాబ్ సీఎం సీరియ‌స్…క్షమాపణ చెప్పే వరకు మాట్లాడను ‌

  • Published By: venkaiahnaidu ,Published On : November 29, 2020 / 05:39 AM IST
హ‌ర్యానా సీఎంపై పంజాబ్ సీఎం సీరియ‌స్…క్షమాపణ చెప్పే వరకు మాట్లాడను ‌

Updated On : November 29, 2020 / 5:41 AM IST

Amarinder Singh targeted Manohar Lal Khattar కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ”ఛలో ఢిల్లీ” ర్యాలీలో పరిస్థితిని అదుపు చేయడంలో హర్యానా ప్రభుత్వం విఫలమైందని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ విమర్శించారు. విఫలమవడమే కాకుండా తిరిగి పంజాబ్‌ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ మేరకు అమరీందర్‌ శనివారం మీడియాతో మాట్లాడారు.



దేశ రాజ‌ధానిలో రైతులు చేస్తున్న ఆందోళ‌న ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య దూరం పెంచింది. ఇక నుంచి హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్ ఫోన్ చేసినా మాట్లాడ‌న‌ని ఆయ‌న అన్నారు. రైతులకు క్షమాపణ చెప్పే వరకు తాను ఆయనతో మాట్లాడనని స్పష్టం చేశారు.



హర్యానా సీఎంకి ఏం మాట్లాడాలో తెలియ‌దు. రైతులు నిర‌స‌న తెల‌ప‌డం వాళ్లు హ‌క్కు. అందుకే మేం వాళ్ల‌ను అడ్డుకోలేదు. కానీ మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు వాట‌ర్ కెనాన్లు, టియ‌ర్ గ్యాస్‌లు వారిపై ప్ర‌యోగిస్తున్నారు? వాళ్ల‌ను మేము ఆప‌డం లేదు, ఢిల్లీ ఆప‌డం లేదు.. మ‌రి మీరు ఎందుకు ఆపుతున్నారు?



హ‌ర్యానా సీఎం తీరు నాకు న‌చ్చ‌డం లేదు. పరిస్థితిని అదుపు చేయకపోగా రైతుల గ్రూపుల్లో అవాంఛనీయ శక్తులు ఉన్నాయని ఆరోపించడమేంటి? వారి నిరసనల వెనక ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు. కేవలం పంజాబ్‌, హరియాణాకు చెందిన రైతులు మాత్రమే ఉన్నారు. మేం సమస్యకు పరిష్కారాన్ని మాత్రమే కోరుకుంటున్నాం. మా రైతుల్ని బాధపెట్టాలని ఏ మాత్రం కోరుకోవడం లేదు. ఖట్టర్‌ రైతులకు క్షమాపణ చెప్పే వరకు నేను ఆయనతో మాట్లాడను అని అమరీందర్‌ స్పష్టం చేశారు.



కాగా,అంతకుముందు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ నిరసన కార్యక్రమానికి పంజాబ్‌ ప్రభుత్వమే కారణమని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ శనివారం ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఆఫీస్‌ బేరర్లు ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.హ‌ర్యానా సీఎం ఖ‌ట్ట‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై అమరీందర్ సింగ్ ఇలా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.