AIADMK BJP Alliance : తమిళనాడులో బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య పొడిచిన పొత్తు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ..

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భాగస్వాములుగా కలిసి బరిలోకి దిగుతామన్నారు.

AIADMK BJP Alliance : తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. తాజాగా బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య పొత్తు పొడిచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలో కలిసి పోటీ చేయనున్నాయి. ఏఐఏడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అలయన్స్ భాగస్వాములుగా కలిసి బరిలోకి దిగుతామన్నారు. చెన్నైలో మీడియాతో అమిత్ షా మాట్లాడారు. ఆయనతో పాటు ఏఐఏడీఎంకే చీఫ్ పళనిస్వామి, బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై ఉన్నారు. 1998 నుంచి ఏఐఏడీఎంకే ఎన్డీయేలో భాగస్వామిగా ఉందని అమిత్ షా గుర్తు చేశారు. గతంలో ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కలిసి పని చేశారని చెప్పారు.

రెండు పార్టీల పొత్తుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు పురోగతి కోసం కలిసి బలంగా, ఐక్యంగా ఉందాం అని ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ”ఏఐఏడీఎంకే ఎన్డీఏ కుటుంబంలో చేరడం సంతోషంగా ఉంది. మా ఇతర ఎన్డీఏ భాగస్వాములతో కలిసి, మేము తమిళనాడును పురోగతిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తాము. రాష్ట్రానికి శ్రద్ధగా సేవ చేస్తాము.

Also Read : దేశంలో హైఅలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల వార్నింగ్.. ఆ ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచన

ఎంజీఆర్, జయలలిత ఆశయాలను నెరవేర్చే ప్రభుత్వాన్ని మేము నిర్ధారిస్తాము” అని మోదీ అన్నారు. “తమిళనాడు పురోగతి కోసం, తమిళ సంస్కృతి ప్రత్యేకతను కాపాడటానికి, అవినీతిమయమైన విభజనకరమైన డీఎంకేను వీలైనంత త్వరగా పెకిలించడం చాలా ముఖ్యం, మా కూటమి ఆ పని చేస్తుంది” అని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

చాలా రోజుల ఊహాగానాల తర్వాత శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నై పర్యటన సందర్భంగా రెండు పార్టీలు తమ పొత్తును నిర్ధారించాయి. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి నాయకత్వంలో ఈ కూటమి పోటీ చేస్తుందని షా తెలిపారు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ నాయకత్వలో, రాష్ట్ర స్థాయిలో అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి నాయకత్వంలో ఎన్నికలు జరుగుతాయన్నారు.

ఈ పొత్తుపై పళనిస్వామి సైతం హర్షం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేకు అచంచలమైన మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు పళనిస్వామి. “ఎన్డీఏతో భాగస్వామ్యంలోకి స్వాగతం పలికినందుకు మాకు గౌరవంగా ఉంది. తమిళనాడు పురోగతి, శ్రేయస్సు కోసం ఉమ్మడి దృక్పథంపై స్థాపించబడిన కూటమి.

Also Read : వాట్సాప్‌కు ఏమైంది.. ఒక్కసారిగా డౌన్.. లాగిన్ అవ్వట్లేదు.. మెసేజ్‌లు పోవట్లేదు.. యూజర్ల ఇబ్బందులు..!

ఈ కీలకమైన సమయంలో గౌరవనీయ ప్రధానమంత్రి మోదీ దార్శనిక మార్గదర్శకత్వంలో, ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి, ఆయన పరివర్తన దృక్పథానికి దోహదపడటానికి ఎన్డీఏ మిత్రులతో కలిసి అన్నాడీఎంకే పని చేస్తుంది” అని పళనిస్వామి అన్నారు.

బీజేపీ, ఏఐఏడీఎంకే పొత్తుపై అధికార డీఎంకే తీవ్రంగా స్పందించింది. బీజేపీతో చేతులు కలిపడాన్ని తప్పుపట్టింది. ఈ పొత్తుని తమిళనాడుకు ద్రోహం చేసినట్లుగా అభివర్ణించింది.