Intelligence Agencies Warning : దేశంలో హైఅలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల వార్నింగ్.. ఆ ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచన
నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలంది.

Intelligence Agencies Warning : భారత్ లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందా? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు భారత్ లో ఉగ్ర దాడులకు పాల్పడే ప్రమాదం ఉందంటూ నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా రైల్వే నెట్ వర్క్ లక్ష్యంగా డ్రోన్, ఐఈడీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్ కు తీసుకొచ్చి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక చేసింది. రైల్వేశాఖను అప్రమత్తం చేసింది. నదీ మార్గాల్లో తీవ్రవాదులు భారత్ లోకి చొరబడవచ్చని, ఆ ప్రాంతాల్లో భద్రతను పెంచాలని నిఘా సంస్థలు సూచించాయి.
భారత రైల్వే అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు సూచించాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పేర్కొన్నాయి. ప్రధాన స్టేషన్లు, రైలు మార్గాల్లో, ముఖ్యంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘా సంస్థలు సూచించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలంది. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, డ్రోన్లు తారసపడ్డా వెంటనే సమాచారం అందించాలని నిఘా వర్గాలు సూచించాయి.
Also Read : ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ తహవూర్ రాణాకు మరణశిక్ష విధించాలి- కసబ్ కేసులో సాక్షి డిమాండ్
పాకిస్తాన్ కు చెందిన కెనడా జాతీయుడు తహవూర్ రాణా.. 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్. అతని పాత్రపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఢిల్లీలోని జాతీయ దర్యాఫ్తు సంస్థ కార్యాలయంలో అతడిని విచారిస్తున్నారు. 12 మంది అధికారుల బృందం ఈ విచారణ జరుపుతోంది. భారత్ లో రాణాకు ఎవరు సహకరించారు, పాకిస్తాన్ లో ఎవరెవరు అధికారులు దాడుల వెనుక ఉన్నారు అనే కోణంలో అధికారులు రాణాను విచారిస్తున్నారు. ఈ విచారణలో పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లు, భవిష్యత్తు కుట్రల గురించి కీలకమైన వివరాలు బయటపడతాయని భద్రతా అధికారులు భావిస్తున్నారు. రాణా విచారణతో పాక్ టెర్రరిస్టుల లోతైన కుట్రలను బహిర్గతం చేస్తుందని ఆశిస్తున్నారు.
2008 నవంబర్ 26న 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా ముంబైకి చేరుకున్నారు. సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. నవంబర్ 29 వరకు మారణహోమం కొనసాగింది. ఈ ఘటనల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు.