Tahawwur Hussain Rana : ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ తహవూర్ రాణాకు మరణశిక్ష విధించాలి- కసబ్ కేసులో సాక్షి డిమాండ్
పాకిస్తాన్ కి చెందిన లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ముంబైలో ఈ దాడులకు పాల్పడ్డారు.

Tahawwur Rana
Tahawwur Hussain Rana : 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహవూర్ హుస్సేన్ రాణా పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో.. నాటి ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడిన వారు ఆ సంఘటనను భయానకంగా గుర్తు చేసుకున్నారు. 2008 నవంబర్ 26న ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో ప్రయాణికులపై దాడి చేసిన ఉగ్రవాదులు దేవిక నట్వర్‌లాల్ రోటవాన్ కుడి కాలుపై కాల్పులు జరిపినప్పుడు ఆమెకు తొమ్మిది సంవత్సరాలు. ఆమె తన సోదరుడు, తండ్రి నట్వర్‌లాల్ రోటవాన్‌తో కలిసి పుణెకు రైలు ఎక్కడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్ళింది. ఆ ఉగ్రవాదులను తర్వాత అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్‌గా గుర్తించారు.
కసబ్ పై కేసులో దేవిక ఆమె తండ్రి కీలక సాక్షులు. నిజానికి ఆమె ఈ కేసులో అతి పిన్న వయస్కురాలు. “నేను CST స్టేషన్‌లో 12 13 ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ఉన్నప్పుడు, నా సోదరుడు రైలు ఎక్కే ముందు రెస్ట్‌రూమ్‌కి వెళ్లాలని చెప్పాడు. ఇంతలో, నా తండ్రి టికెట్ కొనడానికి వెళ్ళాడు. అకస్మాత్తుగా బాంబు పేలుడు, నిరంతర కాల్పుల శబ్దాలు వచ్చాయి. అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నా కుడి కాలుపై కాల్పులు జరిగాయి. నేను అక్కడే కూలిపోయాను. సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో స్థలం లేదు. నన్ను J.J. ఆసుపత్రికి తరలించారు. అక్కడ నేను నెలన్నర పాటు అడ్మిట్ అయ్యాను. ఆరు శస్త్రచికిత్సలు చేయించుకున్నాను” అని బీఏ గ్రాడ్యుయేట్ అయిన 26 ఏళ్ల దేవిక ఆ దురదృష్టకరమైన రాత్రిని గుర్తు చేసుకున్నారు.
కసబ్ విచారణ సాగుతున్న కొద్దీ, దేవిక ఆమె కుటుంబం ఎగతాళికి గురైంది. పాఠశాలలో, పొరుగు వారు ఆమెను ఆట పట్టిస్తూ, “ఏయ్, చూడు, కసబ్ అటుగా వెళ్తున్నాడు” అనేవారు. బంధువులు కుటుంబంతో సంబంధాలను తెంచుకున్నారు. ప్రజలు తమను లక్ష్యంగా చేసుకుంటారనే ఆందోళనతో ఆమె తండ్రి తన డ్రై ఫ్రూట్స్ వ్యాపారాన్ని కోల్పోయాడు.
ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి కావాలని కలలు కంది దేవిక. అది జరగకపోతే దేశానికి సేవ చేయగల, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడగల వృత్తిని కొనసాగించాలనుకుంటోంది. రాణాను భారతదేశానికి అప్పగించిన వార్తను దేవిక కుటుంబం స్వాగతించింది. “రాణాను ఇక్కడికి తీసుకురావడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే అతని వద్ద.. ఇతర సూత్రధారులు ఉగ్రవాదుల గురించి చాలా కీలక సమాచారం ఉండొచ్చు. అతడిని ఉరితీయాలి” అని దేవిక డిమాండ్ చేశారు. ఆమె ఇప్పటికీ అప్పుడప్పుడు కుడి కాలులో వాపు, నొప్పితో బాధపడుతున్నారు.
రాణాను తిరిగి తీసుకువచ్చినందుకు నట్వర్‌లాల్ భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రాణాకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. “తహవూర్ రాణాకు మరణశిక్ష విధించినప్పుడు భారతదేశం ప్రశంసించబడుతుంది. కేసు విచారణ సమయంలో నేను ఉగ్రవాది కసబ్‌ను గుర్తించాను. ప్రధాని మోదీ సింహం లాంటి వాడు. మేము పాకిస్తాన్ లోపలికి వెళ్లి ఉగ్రవాదులను చంపాము. తహవూర్ రాణా తర్వాత డేవిడ్ హెడ్లీ, హఫీజ్ సయీద్ ఇంకా చాలా మంది. మేము భారతీయులం, మేము వారికి భయపడము” అని ఆయన అన్నారు.
తహవూర్ రాణా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరే వినిపిస్తోంది. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి కేసులో అతడు ప్రధాన సూత్రదారి. ఈ కేసులో అరెస్ట్ అయిన రాణా అమెరికా లాస్ ఏంజిల్స్ జైల్లో ఇన్ని రోజులూ శిక్ష అనుభవించాడు. ఈ కేసులో అతడిని అమెరికా అధికారులు భారత్‌కు అప్పగించారు.
Also Read : తహవూర్ రాణా ఎవరు..? డాక్టర్ టెర్రరిస్టుగా ఎలా మారాడు.. అతడ్ని తీసుకురావడానికి భారత్ చేసిన పోరాటం..
తహవూర్ రాణా అప్పగింతపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నిందితుడి అప్పగింత విషయంలో ఎన్డీయే ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం అన్నారు. యూపీఏ హయాంలో ప్రారంభించిన వ్యూహాత్మక దౌత్య ప్రయోజనాలను ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం పొందుతోందన్నారు. తహవూర్ అప్పగింత ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించలేదని స్పష్టం చేశారు. రాణా అప్పగింత ఎన్డీయే గొప్పతనమేమీ కాదని, కానీ మోదీ ప్రభుత్వం మాత్రం క్రెడిట్ తీసుకోవాలని చూస్తోందని విమర్శించారు. యూపీఏ హయాంలో నిందితుడి అప్పగింతపై అమెరికాతో చర్చలు జరిపామని, దాదాపు దశాబ్దానికి పైగా శ్రమించామని ఆయన గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వ విదేశాంగ విధానం వల్లే అప్పగింత సాధ్యమైందని అభిప్రాయపడ్డారు చిదంబరం.
2008 ముంబై ఉగ్రవాద దాడి కేసులో ప్రధాన నిందితుడు తహవూర్ రాణా భారత్‌కు చేరుకున్నాడు. అతడిని అమెరికా నుండి తీసుకొచ్చిన ప్రత్యేక విమానం గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్కడి నుండి అతడిని అధికారులు ప్రత్యేక భద్రత నడుమ తీహార్ జైలుకు తరలించారు. జాతీయ దర్యాప్తు సంస్థ రాణాను తమ అధీనంలోకి తీసుకుంది. సాయంత్రం రాణాను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది.
అమెరికా వెళ్లిన ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సీనియర్ అధికారుల బృందం లాస్ ఏంజెల్స్ నుంచి ప్రత్యేక విమానంలో తహవూర్ రాణాను ఢిల్లీకి తీసుకొచ్చారు. విమానం నుంచి బయటకు వచ్చిన తర్వాత భారత భూభాగంలో అడుగు పెట్టిన వెంటనే అతడిని అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ ప్రకటించింది. విమానాశ్రయంలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత పటియాలా హౌస్ కోర్టులో హాజరు పరిచి తీహార్ జైలుకి తరలించారు.
పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తహవూర్ రాణా. 2008 నవంబర్ లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి. పాకిస్తాన్ కి చెందిన లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ముంబైలో ఈ దాడులకు పాల్పడ్డారు. ఆ దాడుల్లో 166 మంది మరణించగా 239 మంది గాయపడ్డారు. ఆ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు రాణా సపోర్ట్ ఉందని తర్వాత విచారణలో తేలింది. అంతే కాదు, అప్పట్లో రాణా భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడారు కూడా. ఉగ్రవాదుల్ని ప్రశంసిస్తూ.. భారత ప్రజలు ఈ దాడులకు అర్హులేనని మాట్లాడారు. దీంతో ఈ దాడుల వెనక అతని హస్తం ఉందని నిర్థారణ అయింది.
తహవూర్ రాణా భారత్ లోనే కాదు ఇతర దేశాల్లోనూ ఉగ్రవాద చర్యలకు ఊతమిచ్చాడు. దీంతో అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) 2009లో చికాగోలో రాణాను అరెస్టు చేసింది. ముంబై దాడి జరిగిన ఏడాది తర్వాత రాణా అరెస్ట్ అయ్యాడు. డెన్మార్క్‌లో హత్యకు కుట్ర పన్నిన కేసులో అతని నేరం నిర్థారణ అయింది.
అప్పటి నుంచి రాణా లాస్ ఏంజెల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్‌కు అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. రాణా అప్పగింతపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ కు అప్పగిస్తున్నాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’ అని వెల్లడించారు.
రాణా అప్పగింత విషయమైన భారత్ న్యాయస్థానాల్లో పోరాడింది. ఈ క్రమంలో భారత్ ప్రయత్నాలను తహవూర్ పలు ఫెడరల్ కోర్టుల్లో సవాల్ చేశాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ పిటిషన్లు వేశాడు. రాణా చేసిన పిటిషన్లు అమెరికా ఫెడరల్ కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. దీంతో అతడు చివరి ప్రయత్నంగా గతేడాది అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడా అతడికి ఎదురుదెబ్బ తగిలింది.
తనను భారత దేశానికి పంపించాలని జారీ అయిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ రాణా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు తీర్పుతో రాణాను భారత దేశానికి రప్పించడానికి మార్గం సుగమం అయింది. రాణాను భారత్ కి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు గతేడాది జనవరి 25న ఆమోదం తెలిపింది. అయితే తహవూర్ రాణా భారత్ కు రావడానికి నిరాకరించాడు, కోర్టుల్లో పలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాడు. కానీ ఫలితం లేదు. చివరిగా అతడిని భారత్ కి తీసుకొచ్చారు.
ముంబై దాడుల ఉగ్రవాద నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్ కు అప్పగించిన తర్వాత.. 2011లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పోస్ట్ అకస్మాత్తుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబైలో జరిగిన 26/11 దాడులకు సహకరించారనే ఆరోపణల నుండి తహవ్వూర్ రాణాను అమెరికా క్లియర్ చేశాక, UPA ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని విమర్శించారు ప్రధాని మోదీ. ఆ పాత పోస్ట్‌ను నెటిజన్లు Xలో షేర్ చేశారు. ”ముంబై దాడిలో తహవూర్ రాణాను అమాయకుడిగా అమెరికా ప్రకటించడం భారతదేశ సార్వభౌమత్వాన్ని అవమానించడమే. ఇది ‘పెద్ద విదేశాంగ విధాన ఎదురుదెబ్బ'” అని ప్రధాని మోదీ నాడు ట్వీట్ చేశారు.
US declaring Tahawwur Rana innocent in Mumbai attack has disgraced the sovereignty of India & it is a “major foreign policy setback”
— Narendra Modi (@narendramodi) June 10, 2011