బీజేపీ కంచుకోట అయిన గాంధీ నగర్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర క్యాపిటల్ అయిన గాంధీనగర్‌లో 1989 నుంచి బీజేపీ అభ్యర్థులే ఇక్కడ గెలుస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్, లాల్ కృష్ణ అద్వానీ, శంకర్ సిన్హ్ వాఘేలా లాంటి హేమాహేమీలు బీజేపీ తరపున ఈ నియోజకవర్గంలో గెలుపొందారు. 1998 నుంచి అడ్వాణీ మంచి ఆధిక్యంతో గెలుస్తూ వచ్చారు.
బీజేపీ హిందుత్వ భావజాలానికి గుజరాత్‌ను ఒక ప్రయోగశాలగా భావిస్తే, గాంధీనగర్ ఒక నమూనా. మత ప్రాతిపదికన ఓట్లు వేయడం ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఉంటుంది. ప్రస్తుతం మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానానికి బీజేపీ అధ్యక్షుడు ఈసారి ఎన్నికల్లో నేతృత్వం వహిస్తున్నారు. అద్వాణీ ఈ నియోజకవర్గం నుంచి వరసగా ఆరుసార్లు గెలిచారు. ఎప్పుడూ లక్షకు తక్కువ మెజారిటీ రాలేదు.
ఇక తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అమిత్ షా ఇవాళ(30 మార్చి 2019) ఎన్నికల కోసం నామినేషన్ వేస్తున్నారు. నామినేషన్‌కు ముందే అమిత్ షా భారీ మీటింగ్‌ను ఇక్కడ పెట్టనున్నారు. ఈ మీటింగ్‌కు కేంద్రమంత్రులు రాజ్‌నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ హాజరవుతారు. అలాగే మరికొంతమంది ప్రముఖులు, ఎన్‌డీఏ పక్షాలు ఈ మీటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. గుజరాత్ లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 4వ తేదీతో ముగియనుంది. ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 26పార్లమెంట్ సీట్లు ఉన్నాయి.