Ruckus In Bengal Assembly: బెంగాల్ అసెంబ్లీలో రణరంగం.. అరుపులు, కేకలు, రచ్చరచ్చ
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదంతో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. పలు మార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

Ruckus In Bengal Assembly: బెంగాల్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. శాసనసభ రచ్చ రచ్చగా మారింది. అధికార, ప్రతిపక్ష సభ్యల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. అవినీతి, బెంగాలీ వ్యతిరేక పార్టీ అంటూ బీజేపీని ఉద్దేశించి ముఖ్యమంత్రి మమత చేసిన ఆరోపణలు రచ్చకు కారణమయ్యాయి. అటు, బెంగాలీ వలసదారుల హక్కులపై చర్చకు అంతరాయం కలిగించినందుకు బీజేపీ చీఫ్ విప్ శంకర్ ఘోష్‌ను సస్పెండ్ చేశారు. సభ నుంచి వెళ్ళడానికి నిరాకరించడంతో ఘోష్ ను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.
అతి పెద్ద డెకాయిట్ పార్టీ, ఓట్ చోర్ అంటూ నిందలు..
బీజేపీపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యాంటీ బెంగాల్ అంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. అతి పెద్ద డెకాయిట్ పార్టీ, ఓట్ చోర్ అంటూ నిందించారు. దీంతో వివాదం చెలరేగింది. ”బీజేపీ అవినీతిపరుల పార్టీ, ఓట్ల దొంగల పార్టీ, అతిపెద్ద దోపిడీ పార్టీ. మన ఎంపీలను వేధించడానికి సీఐఎస్ఎఫ్‌ను ఎలా ఉపయోగించారో పార్లమెంటులో చూశాము” అని ప్రతిపక్ష ఎమ్మెల్యేల నినాదాల మధ్య బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వారు బెంగాలీ వ్యతిరేకులు” అని నిప్పులు చెరిగారు.
బెంగాలీ వలసదారులపై “దౌర్జన్యాలు” పై ప్రభుత్వ తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం సృష్టించారంటూ బీజేపీ చీఫ్ విప్ శంకర్ ఘోష్‌ను సభ నుండి సస్పెండ్ చేసినట్లు స్పీకర్ బిమాన్ బెనర్జీ తెలిపారు.
తీర్మానంపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడబోతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ప్రారంభించారు. దాంతో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. సెప్టెంబర్ 2న ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారిని ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
స్పృహ కోల్పోయిన బీజేపీ చీఫ్..
శంకర్ ఘోష్ ను సస్పెండ్ చేసినప్పటికీ.. సభ నుంచి బయటకు వెళ్లేందుకు ఘోష్ నిరాకరించారు. దాంతో మార్షల్స్‌ను పిలిపించి ఆయనను సభ నుండి బయటకు ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో ఘోష్ స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బెంగాలీ వలసదారుల హక్కులు, భద్రతకు సంబంధించిన అంశంపై చర్చకు అంతరాయం కలిగించడానికి బీజేపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని సీఎం మమత మండిపడ్డారు. వారి తీరుని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. అన్ పార్లమెంటరీ కండక్ట్ అంటూ విరుచుకుపడ్డారు.
Also Read: కొత్త జీఎస్టీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా..?