మమతకి వరుస షాక్ లు..కీలక నేతల రాజీనామా

మమతకి వరుస షాక్ లు..కీలక నేతల రాజీనామా

Updated On : December 17, 2020 / 8:30 PM IST

TMC leaders resign మరో4-5నెలల్లో 294స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బెంగాల్‌లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. రాజీనామాల పర్వంతో బంగాల్​ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు అధికార తృణమూల్​ కాంగ్రెస్​కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కీలక నేత సువేందు అధికారి తాజాగా పార్టీ సభ్యత్వంతో పాటు ఇతర పదవులను వదులుకున్నారు. తన రాజీనామాను పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపారు. సువేందు దారిలోనే నడుస్తున్నారు మరికొంత మంది టీఎంసీ నేతలు కీలక పదవుల నుంచి తప్పుకున్నారు.

గురువారం(డిసెంబర్-17,2020)తృణముల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్​ నేత, పశ్చిమ్ బర్థమన్ జిల్లా చీఫ్ జితేంద్ర తివారి..అసాన్ సోల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బోర్డ్​ ఆఫ్​ అడ్మినిస్టేషన్​ ఛైర్మన్​ పదవికి రాజీనామా చేశారు. తనను పని చేసుకునేందుకు అనుమతించట్లేదని తివారీ ఆరోపించారు. తనకు పనిచేసేందుకు అనుమతి లేకుంటే.. అలాంటి పోస్ట్ తనక్కర్లేదనుకుని రాజీనామా చేసినట్లు తెలిపారు. అయితే,తివారీ ఇంకా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. పలు జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనాయకులు కూడా రాజీనామా చేశారు.

అదేవిధంగా,మరో టీఎంసీ కీలక నేత దిప్తాంగ్షు చౌదరి దక్షిణ బంగాల్​ రాష్ట్ర రవాణా కార్పొరేషన్​ (ఎస్​బీఎస్​టీసీ) ఛైర్మన్​ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపించారు. అయితే బుధవారం ఎంపీ సునీల్ మండల్ నివాసంలో జరిగిన టీఎంసీ రెబల్స్ మీటింగ్ లో దిప్తాంగ్షు చౌదరి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ మీటింగ్ జిత్రేంద్ర తివారీ,సువెందు అధికారి కూడా హాజరయ్యారు. ఈ వారాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వీరందరూ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.

కాగా, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మొదటిసారిగా పార్టీలో అసమ్మతి ఉన్నట్టు అంగీకరించారు. అయితే అసమ్మతివాదులను సహించేది లేదని, బీజేపీ.నేతల ఎత్తుగడలను వారు గ్రహించి తమ వైఖరిని మార్చుకుంటారని ఆశిస్తున్నానని ఆమె చెప్పారు. రాష్ట్రంలో వచ్ఛే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీని ఓడించేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు తమకు తెలుసునని, అందుకే మాటిమాటికీ ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారని దీదీ పేర్కొన్నారు.

మరోవైపు, కేంద్రం, పశ్చిమ్​ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. బెంగాల్​కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యుటేషన్​పై తక్షణమే కేంద్రానికి పంపాలని హోంమంత్రిత్వ శాఖ మరోసారి జారీ చేసిన ఆదేశాలపై మమత మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ముగ్గురు అధికారులను కేంద్రానికి పంపాలనడం అధికార దుర్వినియోగమేనని విమర్శించారు. ఇది ఐపీఎస్ కేడర్​ అత్యవసర నిబంధన-1954ను వక్రీకరించడమేనని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్​లో గతవారం పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్​పై రాళ్లదాడి జరిగింది. ఇందుకు భద్రతా ఏర్పాట్ల వైఫల్యమే కారణమని కేంద్రం భావించింది. నడ్డా పర్యటనకు భద్రతా ఏర్పాట్లు సమీక్షించిన ముగ్గురు ఐపీఎస్​ అధికారులు కేంద్రానికి రావాలని గతవారమే మొదటిసారి ఆదేశించింది. ఇప్పుడు మరోసారి ఉత్తర్వులు పంపింది.