ఆమోదం పొందేనా? : కేంద్రానికి చేరిన ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం

ఏపీ శాసన మండలి రద్దు తీర్మానం కేంద్రానికి చేరింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌడకు పంపించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ పూర్తిగా పరిశీలించి..ఒక బిల్లును రూపొందించనుంది. ఆ బిల్లుపై కేంద్ర కేబినెట్ లో కూడా చర్చ జరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
అనంతరం ఈ తీర్మానం పార్లమెంట్ కు పంపించి..పార్లమెంట్ ఉభయసభల్లోను అంటే లోక్ సభ, రాజ్యసభల్లో చర్చ జరిపి ఆమోదం పొందాల్సి ఉంది. కాగా ఇప్పటికే పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు శాసన మండలి కావాలని అడుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం మాత్రం తమకు మండలి వద్దని కోరుతూ..రద్దు చేసిన ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది.
ఏపీలో తాజాగా సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని శాసన మండలి వ్యతిరేకిస్తోందనే కారణంగా సీఎం జగన్ మండలిని రద్దు చేశారు. అనంతరం దాన్ని కేంద్రానికి పంపించింది. ఈ క్రమంలో ఈ తీర్మానంపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? రద్దు చేస్తుందా? వ్యతిరేకిస్తుందా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపి ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను బట్టి ఈ తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తుందా? లేక వ్యతిరేకిస్తుందా? అనేది తేలాల్సి ఉంది.
1985లో అప్పటి సీఎం ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేయగా..దాన్ని తిరిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మండలిని పునరుద్ధరించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు. కానీ రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ప్రకారంగా..పార్లెమెంట్ లో ప్రవేశ పెట్టిన అనంతరం మండలి పునరుద్ధరణకు మూడు సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. ఈ క్రమంలో శాసనమండలి రద్దు తీర్మానం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి దాన్ని పునరుద్ధరించటానికి సుదీర్ఘం సమయం పట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
కాగా..త్వరలోనే కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.ఈ క్రమంలో ఈ సమావేశాల్లో ఈ ఏపీ మండలి రద్దు తీర్మానాన్ని పార్లమెంట్ లో ప్రవేశ పెడతారా?లేదా? అనే విషయంపై వేచి చూడాల్సి అవసరం ఉంది. కేంద్రం పూర్తిగా బడ్జెట్ పైనే దృష్టి పెట్టనుంది. దీంతో మండలి రద్దు తీర్మానం బిల్లును పార్లమెంట్ సభల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయోననే విషయంపై వేచి చూడాల్సి ఉంది.
కాగా..ఏపీ మండలి రద్దు తీర్మానం బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లోను ఆమోదం లభించిన పక్షంలో అది రాష్ట్రపతి సంతకం పొందిన తరువాతనే ఏపీ మండలి రద్దు అనే ప్రక్రియ పూర్తవుతుంది. అప్పటి వరకూ ఏపీ మండలి ఉన్నట్లే లెక్క అని రాజకీయ..న్యాయ విశ్లేషకులు తెలిపారు.