మోదీ పేరు తలిస్తే మగాళ్లకు భోజనం పెట్టకండి.. మహిళలకు కేజ్రీవాల్ సూచన

చాలా మంది మగాళ్లు ప్రధాని మోదీ తలుస్తున్నారు. మీ భర్త మోదీ పేరు జపిస్తే భోజనం ఉండదని వార్నింగ్ ఇవ్వండి..

మోదీ పేరు తలిస్తే మగాళ్లకు భోజనం పెట్టకండి.. మహిళలకు కేజ్రీవాల్ సూచన

Arvind Kejriwal appeals to women voters

Arvind Kejriwal appeals to women voters: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మహిళలకు వింత సూచన చేశారు. పురుషులు ప్రధాని నరేంద్ర మోదీ జపం చేస్తే వారిని సెట్ చేయాలని సూచించారు. మోదీ పేరు జపించే వారిక భోజనం పెట్టొద్దని సలహాయిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో ‘మహిళా సమ్మాన్ సమరోహ్’ టౌన్‌హాల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ పథకంతో మహిళల సాధికారత సాకారమవుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలనెలా రూ.1000 ప్రభుత్వం ఇవ్వనుంది. కుటుంబంలో ఎంత మంది మహిళలు ఉంటే అంతమందికి రూ.1000 చొప్పున అందుతుంది.

“చాలా మంది పురుషులు ప్రధాని మోదీ పేరు జపిస్తున్నారు. వారిని మీరు సరిచేయాలి. మీ భర్త మోదీ పేరును జపిస్తే.. ఇంట్లో భోజనం పెట్టబోమని చెప్పండి. మీ సోదరుడు కేజ్రీవాల్ మాత్రమే మీకు అండగా ఉంటారని బీజేపీకి మద్దతిచ్చే సోదరీమణులకు కూడా చెప్పండి. మహిళలకు ఉచిత కరెంటు ఇస్తున్నాం. ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించాం. ఇప్పుడు ప్రతి నెలా మహిళలకు రూ. 1,000 ఇస్తున్నాం. మహిళల కోసం బీజేపీ ఏం చేసింది? బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి? ఈసారి కేజ్రీవాల్‌కు ఓటు వేయండ”ని ఆప్‌ అధినేత కేజ్రీవాల్ అన్నారు.

Also Read: టార్గెట్‌ 370.. ఎన్నికల వేళ బీజేపీ మూడంచెల వ్యూహం

ప్రపంచంలోనే అతిపెద్ద సాధికార కార్యక్రమం
మహిళా సాధికారత పేరుతో ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలు మోసం చేశాయని దుయ్యబట్టారు. “కొంత మంది మహిళలకు పదవులు కట్టబెట్టి నారీలోకం మొత్తాన్ని ఉద్ధరించినట్టు గొప్పలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు ఏవో కొన్ని పదవులు ఇచ్చి.. సాధికారత సాధించామని అంటున్నారు. స్త్రీలకు పదవులు ఇవ్వొద్దని నేను చెప్పడం లేదు. వారికి పెద్ద పదవులతో పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. కానీ దీనివల్ల కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. మిగిలిన మహిళల పరిస్థితి ఏంటి? మేం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకంతో మహిళా సాధికారత సాకారమవుతుంది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మహిళా సాధికార కార్యక్రమం. ఆర్థిక వెసులుబాటుతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంద”ని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Also Read: లోక్‌సభ ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ రాజీనామా.. ఎందుకంటే?