CM Himanta Sarma : అస్సాంలో అయితే ఐదు నిమిషాలే : అక్బరుద్ధీన్ వ్యవహారంపై సీఎం హిమంత వ్యాఖ్యలు
అస్సాంలో అయితే ఐదు నిమిషాల్లో సెట్ అయ్యేది..కానీ తెలంగాణలో రాజకీయాల వల్ల అలా జరగలేదు అంటూ ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ వ్యవహారంపై అస్సాం సీఎం హిమంత వ్యాఖ్యానించారు.

assam cm Himanta biswa akbaruddin owaisi
Assam CM Himanta Sarma..Akbaruddin : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేతల ప్రచారం హోరెత్తుతోంది. మరోవైపు పాత బస్తీలో ఏఐఎంఐఎం నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ లలితాబాగ్ లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఆయన ఓ పోలీస్ అధికారిని హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ స్పందించారు. అస్సాంలో ఇలాంటిది జరగితే కేవలం ఐదు నిమిషాల్లో పరిష్కరించేవాళ్లమని అన్నారు. అస్సాంలో ఇటువంటి ఘటన జరిగి ఉంటే ఐదు నిమిషాల్లోనే వ్యవహారం సద్ధుమణిగేదని చెప్పారు. కానీ తెలంగాణలో రాజకీయాల వల్ల బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ మాట్లాడటంలేదని విమర్శించారు. పోలీసులను అంత బహిరంగంగా బెదిరిస్తే చర్యలు తీసుకోవటంలేదని విమర్శించారు. పోలీసులనే బెదిరిస్తే ప్రజలు పరిస్థితి ఏంటని అన్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులను బెదిరించిన అక్బరుద్ధీన్ శాసనసభ అభ్యర్ధిత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు సీఎం హిమంత.
కాగా.. అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశామని హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రోహిత్ రాజు తెలిపారు. ఐపిసి సెక్షన్ 353 (అధికారిక విధులకు ఆటంకం కలిగించడం), ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు బుక్ చేశామని చెప్పారు.
పోలీసులు అబద్ధాలు చెబుతున్నారు: అక్బరుద్దీన్
తనపై నమోదైన కేసుపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. డీసీపీ, పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తాను బెదిరించానని చెబుతున్న సదరు పోలీసు అధికారి స్టేజ్‌పైకి వచ్చిన వీడియో ఫుటేజీ తన వద్ద ఉందని, రాత్రి 10 గంటల తర్వాత తాను ప్రసంగం చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చన్నారు. సమయం కాకముందే సభను అడ్డుకోవడం సరికాదని.. పోలీసులు ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు.