Massive Traffic Jam: నరకం చూశారు.. 32 గంటలు ట్రాఫిక్ జామ్.. చిక్కుకుపోయిన 4వేల వాహనాలు.. ముగ్గురు మృతి..
ట్రాఫిక్‌ను ఇరుకైన సర్వీస్ లేన్‌లోకి మళ్లించారు. దీని వలన తీవ్ర రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.

Massive Traffic Jam: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో భయంకరమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ ట్రాఫిక్ జామ్ ఎంత దారుణంగా ఉందంటే.. వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ట్రాఫిక్ జామ్ ఏ రేంజ్ లో ఉందంటే.. ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇండోర్-దేవాస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 30 గంటల పాటు ఎక్కడికక్కడ వాహనాలు చిక్కుకుపోయాయి. ఇండోర్ దేవాస్ హైవే 8 కిలోమీటర్లు ఉంటుంది. గురువారం, శుక్రవారం ఈ ఘటన జరిగింది.
గురువారం సాయంత్రం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇది శుక్రవారం రాత్రి వరకు కంటిన్యూ అయ్యింది. సుమారు 4వేల వాహనాలు ఆ మార్గంలో చిక్కుకుపోయాయి. ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. నగర రహదారి, ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఓవైపే హైవే నిర్మాణ పనులు, మరోవైపు భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని ప్రాథమిక సమాచారం.
ట్రాఫిక్‌ను ఇరుకైన సర్వీస్ లేన్‌లోకి మళ్లించారు. దీని వలన తీవ్ర రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. సమీప గ్రామాల మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం ట్రాఫిక్ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది.
భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా పలువురి ప్రాణాలు పోయాయి. సందీప్ పటేల్ (32) అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా అతనికి గుండెపోటు వచ్చింది. ”సందీప్ కు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పాడు. వెంటనే అతడిని తీసుకుని ఆసుపత్రికి బయలుదేరాం. అయితే, మా కారు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంది. చాలా సేపు అక్కడ చిక్కుకుపోయాం. దీంతో సందీప్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ట్రాఫిక్ క్లియర్ అయ్యి సందీప్ ను ఆసుపత్రికి తీసుకెళ్లే సరికి అతడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు” అని సందీప్ అంకుల్ కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇక ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని మరో ఇద్దరు చనిపోయారు. వారిని కమల్ పంచల్(62), బలరామ్ పటేల్(55) గా గుర్తించారు. ”మేము గంటన్నర పాటు ఆ రద్దీలో చిక్కుకుపోయాము. ఈ సమయంలో మా నాన్న బాగా భయపడ్డారు. ఏదో భారంగా ఉన్నట్లు మాతో చెప్పారు. అంతలోనే కారులోనే స్పృహ కోల్పోయారు. దేవాస్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు” అని కమల్ కుమారుడు విజయ్ పంచల్ అన్నారు.
”బిజల్‌పూర్‌లోని శాటిలైట్ టౌన్‌షిప్‌కు చెందిన కమల్ పంచల్ (62) రైతు. తన సోదరి సంతాప కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొడుకు, కోడలితో కలిసి ఆయన వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న కారు అర్జున్ బరోడా సమీపంలో చిక్కుకుంది. చాలా సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో పంచల్ భయాందోళనకు గురయ్యారు. ఊపిరి ఆడటం లేదని చెప్పారు. అంతలోనే స్పృహ కోల్పోయారు. ఆయనను దేవాస్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. అప్పటికే కమల్ పంచల్ మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు” అని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, భారీగా ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమల్ కుటుంబసభ్యులు ఆరోపించారు. ట్రాఫిక్ రద్దీని నిర్వహణకు లేదా ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని కమల్ కుటుంబం ఆరోపించింది.
మరో సంఘటనలో షుజల్‌పూర్‌కు చెందిన క్యాన్సర్ రోగి బలరామ్ పటేల్ (55) కూడా ప్రాణాలు కోల్పోయారు. చికిత్స కోసం ఆయన ఇండోర్‌కు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో ఆయన దగ్గర రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. దేవాస్ చేరుకునేలోపే ఒక సిలిండర్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా రెండవ సిలిండర్ కూడా అయిపోయింది. ట్రాఫిక్ క్లియర్ అయ్యి ఆయనను ఆసుపత్రికి తరలించే సరికి ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ట్రాఫిక్ జామ్ గురించి సమాచారం తెలిసిన ఇండోర్ కలెక్టర్ ఆశీష్ సింగ్ రంగంలోకి దిగారు. NHAI, IMC, ట్రాఫిక్ పోలీసులు, PWD అధికారులను ట్రాఫిక్ క్లియర్ చేయాలని ఆదేశించారు. ఈ భారీ ట్రాఫిక్ జామ్ రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇది ప్రభుత్వ వైఫ్యలమే అంటూ విమర్శలు గుప్పించింది.
“కొన్ని రోజులుగా బైపాస్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ట్రాఫిక్‌ను నిర్వహించడంలో విఫలమైనందుకు పరిపాలనా అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలి” అని కాంగ్రెస్ ప్రతినిధి అమిత్ చౌరాసియా డిమాండ్ చేశారు.
”ఓవైపు హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలను ఇరుకైన సర్వీస్ లేన్‌కు మళ్లించారు. దీని వలన తీవ్ర రద్దీ ఏర్పడింది. ఇదే ట్రాఫిక్ జామ్ కు కారణమైంది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి” అని ఒక వాహనదారుడు తెలిపారు. భారీ ట్రాఫిక్ జామ్ పై వాహనదారులు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారులు చాలా ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపించారు. అత్యవసర స్పందన లేకపోవడం దారుణం అన్నారు.