వాజ్‌పేయి 2వ వర్థంతి…వీడియో షేర్‌ చేసిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : August 16, 2020 / 03:49 PM IST
వాజ్‌పేయి 2వ వర్థంతి…వీడియో షేర్‌ చేసిన మోడీ

Updated On : August 16, 2020 / 4:12 PM IST

ఇవాళ(ఆగస్టు-16,2020)ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్థంతి సందర్భంగా యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది.అటు సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు వాజ్‌పేయికి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు



మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయన్ను స్మరించుకున్నారు. వాజ్‌పేయికి మోడీ ఘనంగా నివాళులర్పించారు.ఈ మేరకు సోషల్ మీడియాలో రెండు నిమిషాల నిడివి కలిగిన ఓ వీడియో పోస్ట్ చేశారు. పుణ్య తిథి సందర్భంగా అటల్‌జీకి నివాళులర్పిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. దేశ పురోగతి కోసం వాజ్‌పేయి అందించిన సేవలను కొనియాడారు. ఆయన సేవలను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందన్నారు మోడీ.

ప్రధానిగా దేశాభివృద్ధికి అటల్‌ బిహారీ వాజ్‌పేయి చేసిన సేవలు ఎనలేనివని ప్రధాని మోడీ తెలిపారు. ఆయన హయాంలోనే భారత్‌ అణు శక్తిగా ఎదిగిందని గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా, ఎంపీగా, ప్రధానిగా అటల్‌ ఈ దేశానికి అమూల్యమైన సేవలను అందించారని అన్నారు.



వాజ్‌పేయి రెండో వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి(సదైవ్ అటల్) వద్ద రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు.

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న వాజ్‌పేయి జన్మించారు. బీజేపీ నుంచి ప్రధాని అయిన మొదటి నాయకుడు ఆయనే. మూడు పర్యాయాలు ఆయన ప్రధానిగా దేశానికి సేవలందించారు. 1996లో, 1998 నుంచి 1999వరకు ఆ తరువాత 1999 -2004 మధ్య పూర్తి ఐదేళ్లు ప్రధానిగా వాజ్‌పేయి కొనసాగారు.



1996లో 13 రోజులు, 1998 నుంచి 1999వరకు 13 మాసాలు…ఆ తరువాత 1999 -2004 మధ్య పూర్తి ఐదేళ్లు ప్రధానిగా వాజ్‌పేయి సేవలందించారు. దేశ ప్రధానిగా ఐదేళ్ల పూర్తి పదవీకాలంపాటు పనిచేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా వాజ్‌పేయి చరిత్ర సృష్టించారు. ఆయన హయాంలోనే 1998 మే 11 -13 మధ్య భారత్‌ పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించింది. 1999 కార్గిల్ యుద్ధంలో పాక్‌కు గట్టిగా బద్ధిచెప్పారు.

2015లో భారత ప్రభుత్వం ఆయన ప్రజాసేవను గుర్తించి దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను బహుకరించింది. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్‌పేయి నివాసానికెళ్లి భారతరత్న పురస్కారాన్ని వాజ్‌పేయికి బహుకరించారు. దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ వాజ్‌పేయి 2018 ఆగస్టు 16న కన్నుమూసిన విషయం తెలిసిందే.