అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా
ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఆ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)తో అనుసంధానమైంది.

అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి నిన్న మధ్యాహ్నం యాక్సియం-4 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఆ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)తో అనుసంధానమైంది.
స్పేస్‌ఎక్స్ ‘డ్రాగన్’ వ్యౌమనౌక డాకింగ్ విజయవంతం కావడంతో వారు నలుగురు ‘ఐఎస్‌ఎస్’లోకి అడుగుట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా వైమానిక దళ పైలట్ శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు.
భారత అంతరిక్షయానంలో దాదాపు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ శుభాంశు శుక్లా ప్రతిష్ఠాత్మక యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్ వెళ్లారు. 1984లో భారతీయుడు రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. భారతీయుడు ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి.
శుభాంశు శుక్లాతో పాటు ఐఎస్‌ఎస్‌కు పెగ్గీ విట్సన్ (అమెరికా), ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగేరి) చేరుకున్నారు. వారు అక్కడే 14 రోజులపాటు పలు పరిశోధనలు చేస్తారు.
కాగా, డాకింగ్ ప్రక్రియకు ముందు డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమి చుట్టూ తిరుగుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు ప్రయాణిస్తుండగా శుభాంశు మాట్లాడారు. అంతరిక్షంలో మైక్రో గ్రావిటీలో జీవించడాన్ని తాను ఓ శిశువులా కొత్తగా నేర్చుకుంటున్నానని, ఖాళీ పరిసరాల్లో తేలిపోవడం అద్భుత అనుభూతిని ఇస్తోందని చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకునే ముందు శుక్లా ‘నమస్కారం ఫ్రమ్ స్పేస్’ (అంతరిక్షం నుంచి నమస్కారం) అని అన్నారు.
డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ నుంచి వీడియో లింక్ ద్వారా శుక్లా మాట్లాడారు. “వాహ్, అది నిజంగా అద్భుతమైన ప్రయాణం” అని అన్నారు. నిన్న ప్రయాణానికి ముందు గ్రేస్ అనే క్యాప్సూల్‌లో కూర్చున్నప్పుడు తమలో ఒక్కటే ఆలోచన ఉందని, ముందుకు వెళ్దామని అనుకున్నామని చెప్పారు. ఈసారి స్పేస్‌ఎక్స్ కొత్త డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు వ్యోమగాములు ‘గ్రేస్’ అనే పేరు పెట్టారు.
“ప్రయాణం మొదలైన సమయంలో సీట్లో వెనక్కి తోసినట్టు అనిపించింది. తర్వాత ఒక్కసారిగా శాంతి.. అంతటా మౌనం.. తేలిపోతున్నాం.. సీట్ బెల్ట్ తీసేసిన తర్వాత అంతరిక్షంలో తేలిపోవడం అద్భుతంగా అనిపించింది” అని శుక్లా అన్నారు. తమతో తీసుకెళ్లిన ‘జాయ్’ అనే ఆటబొమ్మను కూడా శుక్లా పరిచయం చేశారు.