అయోధ్యలో అద్భుత ఘట్టం.. రామనామస్మరణతో మార్మోగుతున్న దేశం..

కొన్నేళ్ల క్రితం వరకూ కూడా ఈ దేశంలో ఇదొకటి సాధ్యమంటే.. నమ్మేవారికంటే.. నమ్మనివారే ఎక్కువ. కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యమవుతుంది. కళ్లముందు మహిమాన్విత దృశ్యం కనిపించబోతోంది.

ayodhya ram mandir consecration

Ayodhya Ram Mandir: అందరి చూపూ, అందరి ఆలోచనా.. అందరి దృష్టి.. అందరి ఆసక్తి.. అయోధ్యపైనే ఉంది. హిందువుల జీవితకాలపు కల..నిజంకాబోతున్న రోజు దగ్గరపడుతున్న కొద్దీ.. ప్రజల్లో భావోద్వేగం పెరిగిపోతోంది. శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువుతీరే చారిత్రక, మహిమాన్విత, మహాద్భుత క్షణానికి ప్రత్యక్ష సాక్షులుగా మిగిలేందుకు.. ఆ మహోజ్వలఘట్టాన్ని.. మనసు పొరల్లో చెదరని జ్ఞాపకంగా నిలుపుకునేందుకు దేశవిదేశాల్లో రామభక్తులు ఎదురుచూస్తున్నారు. పురాణ, ఇతిహాసాల్లోనే కాదు.. వర్తమానంలోనూ రామనామానికి, హిందువులకు ఉన్న బంధం అద్వితీయం,అనిర్వచనీయం. అందుకే రామజన్మభూమిలో సీతారామచంద్రులు సగర్వంగా కొలువుతీరడం మనకాలపుమహోన్నత దృశ్యం. అందునా.. అసలు సాధ్యంకాదేమో అనుకున్నది.. సజీవసాక్ష్యమై కళ్లముందు ఆవిష్కృతమవుతుంటే.. ఇంతకు మించిన అపురూప సన్నివేశం మనందరి జీవితకాలంలో ఇంకేముంటుంది. అందుకే రామభక్తులంతా చలో అయోధ్య అంటున్నారు.

ఆధ్యాత్మిక వైభవానికి చిరునామా
దేశంలో అన్నిరోడ్లూ అయోధ్యకే దారితీస్తున్నాయి. అయోధ్య వెలిగిపోతోంది. భారత ఆధ్యాత్మిక వైభవానికి చిరునామాగా మారుతోంది. అయోధ్యకు అందరి ఆశీర్వాదాలూ అందుతున్నాయి. దేశమంతా రామనామస్మరణతో మార్మోగుతోంది. కలియుగంలోని అయోధ్య.. త్రేతాయుగం నాటి అయోధ్య ఆనవాళ్లను గుర్తుచేస్తోంది. శ్రీరాముడు పుట్టి పెరిగిన నేల.. వ్యక్తిత్వంతో, పాలనతో ఆయన్ను యుగయుగాలకూ ఆదర్శప్రాయుడిగా నిలపిన అయోధ్య భూమి.. బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో పులకించచబోతోంది. రామగాథలు వింటూ.. రామచంద్రుని కథలు చెప్పుకుంటూ, రాముడిలా ఉండడమే జీవితానికి పరమావధి అని తెలుసుకుంటూ పెరిగిన హిందువులకు.. అయోధ్యలో ఆవిష్కృతం కాబోతున్న అద్భుతఘట్టాన్ని తలచుకుంటేనే భక్తిపారవశ్యం కలుగుతోంది.

కొన్నేళ్ల క్రితం వరకూ కూడా ఈ దేశంలో ఇదొకటి సాధ్యమంటే.. నమ్మేవారికంటే.. నమ్మనివారే ఎక్కువ. కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యమవుతుంది. కళ్లముందు మహిమాన్విత దృశ్యం కనిపించబోతోంది. రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ట ఘటనతో వందల సంవత్సరాల చరిత్ర కొత్త మలుపు తీసుకోబోతోంది. అందుకే దేశమంతా అయోధ్య వైపే చూస్తోంది. ఊరూవాడ అంతటా రామనామస్మరణ తప్ప మరేమీ వినిపించడం లేదు. ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలో సీతాంజనేయలక్ష్మణ సమేత శ్రీరాముడు కొలువుతీరనున్నాడు.

Also Read: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం కొట్టివేత

భక్తులు ఇళ్లలోనే ఉండి రామజ్యోతి వెలిగించాలి
ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆహ్వానం అందినవారు మాత్రమే అయోధ్యకు రావాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరింది. భక్తులు ఇళ్లలోనే ఉండి రామజ్యోతి వెలిగించాలని ప్రధాని మోదీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో ఊరేగింపులు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో భజనలు, కీర్తన కార్యక్రమాలు సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మొత్తం రామచరిత్ మానస్ పారాయణం జరుగుతోంది. ఈ నెల 14 నుంచి మార్చి 24 వరకు అయోధ్యలోని అన్ని దేవాలయాల్లో రామాయణం, భజనకీర్తనలు, రామచరితమానస్‌తో పాటు సుందరకాండ పఠనం నిర్వహించాలని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు.

పలువురు రామభక్తులు, కళాకారులు గీతాలు, భజనలు రూపొందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. వాటిలో తనకు నచ్చినవాటిని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. స్వస్తి మెహుల్ అనే సింగర్ రాముడు వస్తున్నాడు అని పాడిన పాట, శ్రీరామ్ ఘర్ ఆయే పేరుతో గుజరాత్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని పాడిన పాటను షేర్ చేశారు. ఆ పాటల అర్ధం వివరిస్తూ ట్వీట్ చేశారు.

Also Read: బాయ్‌కాట్ మాల్దీవ్స్‌.. ఇండియాలో ఇప్పుడిదే ట్రెండింగ్ ఇష్యూ.. రంగంలోకి సెలబ్రిటీలు

ఇంటింటికీ స్వామివారి అక్షింతలు
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా స్వామివారి అక్షింతలను ఇంటింటికీ పంచుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డూలను అయోధ్యకు పంపుతోంది. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో భాగమైన శ్రీరాముడి వేడుకల్లో పాల్గొనే భక్తులు, వీవీఐపీలకు తిరుపతి దేవస్థానం ద్వారా 25 గ్రాముల బరువున్న లడ్డూలు లక్ష అందిస్తారు. సాధారణంగా పంపిణీ చేసే తిరుమల లడ్డూ బరువు 75 గ్రాములు ఉంటుంది. అయోధ్య వేడుక కోసం ప్రత్యేకంగా 25 గ్రాముల లడ్డూలు తయారుచేస్తున్నారు.