Bilkis Bano : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేత

బిల్కిన్ బానో కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గుజరాత్ ప్రభుత్వం తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది.

Bilkis Bano : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేత

Bilkis Bano Case

Supreme Court : బిల్కిస్ బానో కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గుజరాత్ ప్రభుత్వం తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. బిల్కిస్ బానోపైన సామూహిక అత్యాచారం కేసులో దోషులైన 11 మంది ఖైదీలకు రెమిషన్ (శిక్షాకాలం తగ్గింపు) మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Also Read : Bilkis Bano Case: హిందువులు రేప్ చేయరు.. బిల్కిస్ బానో అత్యాచార నిందితుడు

ఈ పిటీషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం తీర్పును సోమవారం వెలువరించింది. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని పేర్కొంది. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులను జారీచేసే అర్హత మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, గుజరాత్ ప్రభుత్వానికి ఉండదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మహారాష్ట్రలోనే విచారణ జరిగిందని, అపరాధికి శిక్ష పడిన రాష్ట్ర ప్రభుత్వానికే ఉపశమనాన్ని మంజూరు చేయడానికి తగిన అర్హత ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. విడుదలైన 11 మంది రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Also Read : Bilkis Bano Case: 11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం గడప తొక్కిన బిల్కిస్ బానో

2002 మార్చిలోని గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్ లో చెలరేగిన అల్లర్ల సమయంలో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్ పూర్ గ్రామంలో బిల్కిన్ బానో కుటుంబంపై దుండుగులు దాడి చేశారు. వారిలో ఏడుగురిని హత్య చేశారు. ఆ సమయంలో బిల్కిన్ బానో వయస్సు 21 సంవత్సరాలు. అప్పటికి ఆమె ఐదు నెలల గర్భిణి. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 2008 జనవరి 21న 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్ధించింది.

కొద్దికాలం తరువాత తనను విడుదల చేయాలంటూ వారిలో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫారస్సు చేశారు. అయితే, 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టు తాజా తీర్పును వెల్లువరించింది.