సీఏఏ వ్యతిరేక తీర్మాణం చేసిన బెంగాల్… పాక్ బ్రాండ్ అంబాసిడర్ గా బీజేపీ

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా స్వరాలు వినిపించారు.కేరళ,పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాలు అయితే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మాణం కూడా పాస్ చేశాయి. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రాల వరుసలో వెస్ట్ బెంగాల్ కూడా చేరింది. సీఏఏకు వ్యతిరేకంగా సోమవారం(జనవరి-27,2020)వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ తీర్మాణం చేసింది.
వెస్ట్ బంగాల్ లో సీఏఏ,ప్రతిపాదిత ఎన్ఆర్సీలను తాము అనుమతించే ప్రశక్తే లేదని అసెంబ్లీలో ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ అన్నారు. సీఏఏ,ఎన్ఆర్సీ వ్యతిరేక పోరాటం మైనార్టీలదే కాదని,ముందుండి ఈ ఆందోళనలు నడిపిస్తున్న హిందూ సోదర,సోదరీమణులకు కూడా తాను ధన్యవాదాలు చెబుతున్నానని మమత అన్నారు. సీఏఏ ప్రకారం భారతదేశ పౌరుడు కావాలంటే విదేశీయుడు అవ్వాలని…ఇది భయంకరమైన ఆట అని,ప్రజలను చావు వైపు నెట్టబడుతున్నారని,కేంద్రం ట్రాప్ లో ఎవ్వరూ పడొద్దని మమతా బెనర్జీ అన్నారు.
అనుమానాస్పద పౌరులు అనే ట్యాగ్,డిటెన్షన్ సెంటర్లు అంగీకరించబడవన్నారు. పుట్టకపోవడమే మంచిదనేలా విషయాలు ఉన్నాయన్నారు. దేశం వదిలి పోవాల్సి వస్తుందేమోనని ప్రస్తుతం ప్రజలు భయపడుతున్నారన్నారని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ పాకిస్తాన్ బ్రాండ్ అంబాసిడర్ అని మమత విమర్శించారు. బీజేపీ ఎప్పుడూ హిందుస్థాన్ గురించి తక్కువగా మాట్లాడి పాకిస్తాన్ గురించి ఎక్కువగా మాట్లాడుతుందన్నారు. మరోవైపు సీఏఏను పార్లమెంట్ ఆమోదించిందని,రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు అమలుచేసి తీరాల్సిందేనని కేంద్రప్రభుత్వం అంటోంది. సీఏఏ వ్యతిరేక తీర్మాణాలు చేయడాన్ని తప్పుబడుతోంది. సీఏఏను ఉపసంహరించుకునే ప్రశక్తే లేదంటోంది.
సీఏఏ వ్యతిరేక తీర్మాణం… ప్రజల ఇష్టానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఇటీవల పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇటీవల అన్నారు. సీఏఏ రాజ్యాంగవ్యతిరేకమంటూ,దానిరి వ్యతిరేకంగా తీర్మాణం పాస్ చేయడం అసెంబ్లీ డ్యూటీ అంటూ కేరళ ప్రభుత్వం దేశంలో మొదటిగా సీఏఏ వ్యతిరేక తీర్మాణాన్ని అసెంబ్లీలో పాస్ చేసింది.