Bihar election result : తుది ఫలితం కోసం రాత్రి వరకు ఆగాల్సిందే

  • Published By: venkaiahnaidu ,Published On : November 10, 2020 / 02:44 PM IST
Bihar election result : తుది ఫలితం కోసం రాత్రి వరకు ఆగాల్సిందే

Updated On : November 10, 2020 / 3:58 PM IST

Bihar assembly election result 2020 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే కూటమి దూసుకుపోతుంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో NDA కూటమి ముందంజలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ ని కూడా దాటి ఎన్డీయే కూటిమి దూసుకుపోతోంది.అయితే, మహాకూటమితో పోలిస్తే ఎన్​డీఏ స్వల్ప ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో తుది ఫలితంపై అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.



https://10tv.in/bihar-assembly-elections-where-is-the-voters-are-exit-polls-real/
అయితే,ఓట్ల లెక్కింపు ఇవాళ సాయంత్రం వరకు కొనసాగుతుందని బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(CEO) హెచ్ఆర్ శ్రీనివాస్ తెలిపారు. బీహార్​లో మొత్తం పోలైన ఓట్లు 4.10 కోట్లు కాగా.. ఇప్పటివరకు 92లక్షల ఓట్ల లెక్కింపు మాత్రమే పూర్తయిందని తెలిపారు. సాధారణంగా బీహార్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు 25-26 రౌండ్లలో పూర్తయ్యేది. కానీ, ఈ సారి 35 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే 50-51రౌండ్ల కౌంటింగ్ ఉన్నట్లు హెచ్ఆర్ శ్రీనివాస్ చెప్పారు. సగటున ఒక్కో నియోజకవర్గంలో 30-35రౌండ్ల కౌంటింగ్ ఉందని చెప్పారు. దీంతో తుది ఫలితం కోసం రాత్రి వరకు వేచిచూడాల్సిందేనని శ్రీనివాస్ తెలిపారు.



కాగా, ఇంకా చాలా ఓట్లు లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఆయా స్థానాల్లో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు లేకపోలేదు. కొంతమంది ​జేడీయూ కీలక నేతలూ వెనుకంజలో ఉండటం ఇందుకు బలం చేకూర్చుతోంది.