సీఎం అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

సీఎం అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

Updated On : November 11, 2020 / 8:25 PM IST

Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నువ్వానేనా అని ఊరిస్తూ.. ఉత్కంఠభిరతంగా సాగి చివరకు నితీశ్‌ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే పైచేయి దక్కింది. జేడీయూ కంటే బీజేపీకే అత్యధిక స్థానాలు దక్కినప్పటికీ నితీశ్‌కే మరోసారి సీఎం పీఠం దక్కింది. ఈ ఎన్నికల్లో 7లక్షల మందికి పైగా ఓటర్లు ఏ అభ్యర్థి పట్లా ఆసక్తి ప్రదర్శించకపోవడం గమనార్హం.

రాష్ట్రంలో 7లక్షల 6వేల 252 (1.7శాతం) మంది ఓటర్లు నోటాకు మొగ్గు చూపడమే గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో లండన్‌ నుంచి వచ్చి ప్లూరల్స్‌ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన 28 ఏళ్ల పుష్పమ్‌ ప్రియా చౌదరి ఘోరంగా ఓటమిని ఎదుర్కొన్నారు. రెండు స్థానాల నుంచి పోటీచేసి చిత్తుగా ఓడిపోయారు. ఓ చోట నోటా కంటే తక్కువ ఓట్లు రాగా.. మరో స్థానంలో డిపాజిట్‌ కూడా దక్కని పరిస్థితి ఎదుర్కొన్నారు.



దర్భంగాకు చెందిన పుష్పమ్‌ ప్రియా చౌదరి జేడీయూ సీనియర్‌ నేత వినోద్‌ చౌదరి కుమార్తె. లండన్‌లో స్థిరపడిన ఆమె.. తండ్రి ఎమ్మెల్సీగా ఉన్న పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించలేదు. సొంతగా కొత్త రాజకీయ పార్టీ పెట్టి ‘ప్లూరల్స్‌’ పేరుతో ఇటీవలే బీహార్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

బీహార్ డెవలప్‌మెంట్ కోసం ప్రజలు మద్దతివ్వాలంటూ అభ్యర్థించారు. సీఎం అయితే 2025వ సంవత్సరం నాటికి బీహార్‌ను దేశంలోనే డెవలప్‌డ్ స్టేట్‌గా తీర్చిదిద్దుతాననే హామీతో ఎన్నికల బరిలో దిగినప్పటికీ ఆమెపై ఆదరణ చూపించలేదు. బైస్ఫీ నియోజకవర్గంలో పుష్పం ప్రియకు 1521 ఓట్లు రాగా.. ఆరో స్థానంలో నిలిచారు. ఇక్కడ భాజపా అభ్యర్థి హరిభూషణ్‌ ఠాకూర్‌కు 86వేల కంటే ఎక్కువ ఓట్లు రాగా.. నోటాకు 2వేల 929 ఓట్లు రావడం గమనార్హం.

మరో స్థానం బంకీపూర్‌లో పోటీ చేసిన ఆమెకు 5వేల 189 ఓట్ల వచ్చి పదో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ నోటాకు 1213 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా ప్రియ భాజపా చేతిలోనే ఓడిపోయారు.